ఎన్నిసార్లు తిరగాలి : వికలాంగుల ఆవేదన
కాకినాడ క్రైం : వారి వైకల్యం కంటికి కనిపిస్తున్నా సర్టిఫికెట్ లేనిదే పింఛన్ రాదు. దాంతో సర్టిఫికెట్లకోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోతోంది. చివరికి విసుగు చెందిన కొందరు శుక్రవారం కలెక్టర్ నీతూ ప్రసాద్‌ను కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జిల్లాలో సుమారు ఐదు వేల మంది వికలాంగులు పింఛన్లు పొందుతున్నారు. వారిలో చాలా మంది సర్టిఫికెట్లు తీసుకున్నారు. అయితే అవి పనికిరావని, సదరమ్ సర్టిఫికెట్లు కొత్తగా తీసుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. చాలా మంది వికలాంగులకు సదరమ్ సర్టిఫికెట్ లేకపోవడంతో పింఛను నిలిచిపోయింది. కాకినాడ ప్రభుత్వాస్పత్రి, రాజమండ్రి జిల్లా ఆస్పత్రుల్లో ప్రతి శుక్రవారం వికలాంగ సర్టిఫికెట్లు జారీ చేస్తుండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వికలాంగులు అక్కడకు వచ్చి అష్టకష్టాలు పడ్డారు.
ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
వికలాంగత్వ సర్టిఫికెట్ పొందేందుకు ముందుగా కాకినాడలోని జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలోని నం. 0884-2352153కు ఫోన్ చేసి పేరు నమోదు చేయించుకోవాలి. వారు సర్టిఫికెట్ కోసం ఏ ఆస్పత్రికి ఎప్పుడు వెళ్లాలో చెబుతారు. దాని ప్రకారం వచ్చిన వారికి మాత్రమే సర్టిఫికెట్ ఇస్తారు. అయితే వికలాంగులు నేరుగా ఆస్పత్రులకు రావడంతో వారితోపాటు తాము కూడా ఇబ్బంది పడుతున్నామని వైద్యులు, సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రతి ఒక్క వికలాంగుడు కాల్ సెంటర్‌లో నమోదు చేయించుకోవాలని వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ వెంకటేశ్వర రావు సూచించారు.