Sadaram certificate
-
తల్లడిల్లుతున్న తల్లి.. పిల్లలిద్దరూ దివ్యాంగులే
జన్మనిచ్చిన పిల్లలకు కష్టం వస్తే ఆ తల్లి బాధలు వర్ణనాతీతం.. వారి బాధలు చూసినప్పుడల్లా పేగు బంధం తల్లిడిల్లిపోతుంది.. ఓ వైపు ఆస్పత్రిలో చేరిన భర్త ఏమయ్యాడో తెలియదు.. మరో వైపు ఉన్న ఇద్దరు పిల్లలు దివ్యాంగులు కావడంతో ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. ఇదీ ఓ మాతృమూర్తి భారతి దీన గాథ.. తాండూరు రూరల్: మండలంలోని ఓగిపూర్‌కు చెందిన కుర్వ భారతి, పాండు దంపతులు. భారతిని బషీరాబాద్ మండలం నవాంద్గీ గ్రామానికి చెందిన పాండుకు ఇచ్చి వివాహం చేశారు. ఐదేళ్ల నుంచి భర్త కనిపించడం లేదు. దీంతో భారతి తల్లిగారి ఊరు ఓగిపూర్‌లో ఉంటోంది. ఈమెకు కూతురు అర్చన(13), కొడుకు మల్లేష్(9) ఉన్నారు. ఐదేళ్లు వచ్చే వరకు ఇద్దరూ బాగానే ఉండేవారు. ఆ తర్వాత ఒక్క సారిగా జ్వరం వచ్చి నడవలేని స్థితికి చేరారు. పిల్లల్లో ఎదుగుదల లోపించిందని తల్లి ఆవేదన చెందుతోంది. లివర్ సంబంధిత వ్యాధిలో బాధపడుతున్న భర్త పాండును లాక్ డౌన్‌కు ముందు ఆస్పత్రిలో చేర్పించింది. అప్పటి నుంచి ఇంటికి రాలేదని, ఉన్నడో.. చనిపోయాడో తెలియడం లేదని భారతి బోరున విలపిస్తోంది. ప్రస్తుతం పిల్లలిద్దరిని తన తల్లి ఎల్లమ్మ వద్ద ఉంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. దివ్యాంగులైన పిల్లలకు పింఛన్ వస్తే కొంత మేలు జరుగుతుందని భావిస్తోంది. పింఛను మంజూరు కావాలంటే సదరం సర్టిఫికెట్ తప్పని సరి అని అధికారులు చెప్పడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి తన ఇద్దరు పిల్లలకు సదరం సర్టిఫికెట్ ఇప్పించి పెన్షన్ వచ్చేలా చూడాలనిభారతిదీనంగా వేడుకుంటోంది. -
10 నుంచి సదరం స్లాట్ బుకింగ్‌లు
సాక్షి, అమరావతి : సదరం సర్టిఫికెట్లు పొందేందుకు స్లాట్ బుకింగ్‌లు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలలకు స్లాట్లు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్లు బుక్ చేసుకున్న వారికి రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో 171 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎన్టీ వైద్యులు పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి శాశ్వత ధ్రువీకరణ పత్రాలిస్తారు. గతంలో ఏ జిల్లాకు చెందినవారు ఆ జిల్లాలోని ఆస్పత్రుల్లోనే స్లాట్ బుక్ చేసుకుని స్క్రీనింగ్‌కు హాజరుకావాల్సి ఉండేది. ఈ క్రమంలో విద్య, ఉపాధి, కుటుంబ అవసరాల నిమిత్తం సొంత జిల్లాలను విడిచి వేరే జిల్లాల్లో నివసించేవారు సదరం సర్టీ ఫికెట్ పొందేందుకు సొంత జిల్లాకు వెళ్లాల్సి వచ్చేది. ఇది వ్యయప్రయాసలతో కూడుకున్న ప్రక్రియ. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం రాష్ట్రంలోని ఏ జిల్లాలో అయినా సదరం స్క్రీనింగ్‌కు హాజరై సర్టీ ఫికెట్ పొందేందుకు ప్రభుత్వం గతేడాది జూలై నుంచి అవకాశం క ల్పించింది. -
‘సాక్షి’ కథనాల ఎఫెక్ట్.. సదరం స్కాంపై ఏసీబీ కేసు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సదరం సర్టిఫికెట్ల కుంభకోణంపై ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) స్పందించింది. ఈ వ్యవహారంలో ‘సాక్షి’ రాసిన పలు పరిశోధనాత్మక కథనాల ఆధారంగా స్పందించిన హైదరాబాద్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ కార్యాలయం ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. లోతుగా ఆరా తీసేందుకు రంగంలోకి దిగిన ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ‘దివ్యంగా దోచేస్తున్నారు’శీర్షికన తొలిసారిగా ఈ కుంభకోణాన్ని ‘సాక్షి’వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. సదరం సర్టిఫికెట్లు తీసుకున్న పలువురు అనర్హులు ప్రతినెలా దివ్యాంగ పింఛన్లు, బస్, రైలు పాసుల్లో రాయితీలు, ఏటా ఆదాయపు పన్ను రాయితీ, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందుతూ ప్రభుత్వ ఖజానాకు అంతులేని నష్టాన్ని చేకూరుస్తున్నారు. జిల్లా సివిల్ ఆసుపత్రికి నోటీసులు! రాష్ట్ర ఖజానాకు నష్టాన్ని చేకూరుస్తున్న ఈ కుంభకోణంపై ఏసీబీ అధికారులు ఇప్పటికే డీఆర్డీఏ అధికారులకు కొన్ని ప్రశ్నలతో కూడిన నోట్‌ను పంపారు. దానికి వారి నుంచి సమాధానం రాగా తాజాగా కరీంనగర్ జిల్లా సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు సైతం నోటీసులు పంపించారు. ఇక్కడనుంచి వచ్చే సమాధానాల ఆధారంగా ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏడు జిల్లాల పరిధిలో జారీ అయిన పలు అనుమానాస్పద సర్టిఫికెట్లపై ఏసీబీ అధికారులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టారు. అసలేం జరిగింది..? కరీంనగర్‌లోని జిల్లా సివిల్ ఆస్పత్రి– కలెక్టరేట్లో డీఆర్డీఏలోని కొందరు అధికారులు కలిసి అనర్హులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసే తతంగానికి తెరలేపారు. వీరంతా పలు మండలాల్లో ఏజెంట్లను, తమకు అనుకూలమైన వైద్యులతో ముందే మాట్లాడుకుని వారి నుంచి రూ.లక్షలు వసూలు చేసి వారు అడిగినంత వైకల్య శాతాన్ని వేసి పంపేవారు. ఇందుకోసం సదరం వ్య వహారాలు చూసే ఇద్దరు డీఆర్డీఏ ఉద్యోగుల (శ్రీనివా స్, కిశోర్)ను పెట్టుకున్నారు. వాస్తవానికి వీరిని 2019 లోనే డీఆర్డీఏ తొలగించగా..ఈ వ్యవహారంలో ఉన్న పూర్వానుభవంతో ఎలాంటి నియామక పత్రాలు లేకున్నా..26 నెలలపాటు శ్రీనివాస్, కిశోర్‌తో సివిల్ ఆసుపత్రిలో దందా చేయించారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
అయ్యో పాపం ‘చక్రి’ సోదరుడు.. సదరం కోసం ఎన్ని తిప్పలో..
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మాధవరావు అలియాస్ మహిత్ నారాయణ్ సదరం సర్టిఫికెట్ కోసం రెండేళ్లుగా తిప్పలు పడుతున్నాడు. లాక్‌డౌన్‌తో పాత స్లాట్ రద్దు కాగా.. కొత్త స్లాట్ బుక్ కాకపోవడంతో పడరాని పాట్లుపడుతున్నాడు. సర్కారు ఆసుపత్రిలో నిర్వహించే సదరం క్యాంప్‌లతో పాటు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని సోమవారం విలేకరుల ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడు. ఇదీ పరిస్థితి.. మహబూబాబాద్ జిల్లా కంభాలపల్లి గ్రామానికి చెందిన జిల్లా మాధవరావు ఉన్నత విద్యాభాసం కోసం నగరానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. ప్రస్తుతం ఆయన బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. పుట్టుకతోనే వైకల్యానికి గురైన ఆయన వీల్‌చైర్‌పై దైనందిన కార్యకలాపాలు పూర్తి చేసుకుంటాడు. అయితే తనసోదరుడి వద్ద నేర్చుకున్న సంగీతంతో కొత్తగా మ్యూజిక్ స్టూడియో పెట్టుకునేందుకు వికలాంగుల కోటా కింద బ్యాంకు రుణం కావాలని కొద్దిరోజుల క్రితం ఆయన నగరంలోని ఓ బ్యాంకును ఆశ్రయించగా, సదరం సర్టిఫికెట్ తప్పని సరిగా ఉండాలని అధికారులు సూచించారు. వివిధ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. సర్టిఫికెట్ కోసం రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్నానని, ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన వేడుకుంటున్నారు. చదవండి👉 R Madhavan: నా తండ్రి గుర్తింపుతో బతకాలని లేదు: మాధవన్ కొడుకు వేదాంత్ -
ఎన్నిసార్లు తిరగాలి : వికలాంగుల ఆవేదన
కాకినాడ క్రైం : వారి వైకల్యం కంటికి కనిపిస్తున్నా సర్టిఫికెట్ లేనిదే పింఛన్ రాదు. దాంతో సర్టిఫికెట్లకోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోతోంది. చివరికి విసుగు చెందిన కొందరు శుక్రవారం కలెక్టర్ నీతూ ప్రసాద్‌ను కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జిల్లాలో సుమారు ఐదు వేల మంది వికలాంగులు పింఛన్లు పొందుతున్నారు. వారిలో చాలా మంది సర్టిఫికెట్లు తీసుకున్నారు. అయితే అవి పనికిరావని, సదరమ్ సర్టిఫికెట్లు కొత్తగా తీసుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. చాలా మంది వికలాంగులకు సదరమ్ సర్టిఫికెట్ లేకపోవడంతో పింఛను నిలిచిపోయింది. కాకినాడ ప్రభుత్వాస్పత్రి, రాజమండ్రి జిల్లా ఆస్పత్రుల్లో ప్రతి శుక్రవారం వికలాంగ సర్టిఫికెట్లు జారీ చేస్తుండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వికలాంగులు అక్కడకు వచ్చి అష్టకష్టాలు పడ్డారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి వికలాంగత్వ సర్టిఫికెట్ పొందేందుకు ముందుగా కాకినాడలోని జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలోని నం. 0884-2352153కు ఫోన్ చేసి పేరు నమోదు చేయించుకోవాలి. వారు సర్టిఫికెట్ కోసం ఏ ఆస్పత్రికి ఎప్పుడు వెళ్లాలో చెబుతారు. దాని ప్రకారం వచ్చిన వారికి మాత్రమే సర్టిఫికెట్ ఇస్తారు. అయితే వికలాంగులు నేరుగా ఆస్పత్రులకు రావడంతో వారితోపాటు తాము కూడా ఇబ్బంది పడుతున్నామని వైద్యులు, సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రతి ఒక్క వికలాంగుడు కాల్ సెంటర్లో నమోదు చేయించుకోవాలని వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ వెంకటేశ్వర రావు సూచించారు.