దివ్యాంగులైన ఇద్దరు పిల్లలతో తల్లి భారతి
జన్మనిచ్చిన పిల్లలకు కష్టం వస్తే ఆ తల్లి బాధలు వర్ణనాతీతం.. వారి బాధలు చూసినప్పుడల్లా పేగు బంధం తల్లిడిల్లిపోతుంది.. ఓ వైపు ఆస్పత్రిలో చేరిన భర్త ఏమయ్యాడో తెలియదు.. మరో వైపు ఉన్న ఇద్దరు పిల్లలు దివ్యాంగులు కావడంతో ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. ఇదీ ఓ మాతృమూర్తి భారతి దీన గాథ..
తాండూరు రూరల్: మండలంలోని ఓగిపూర్‌కు చెందిన కుర్వ భారతి, పాండు దంపతులు. భారతిని బషీరాబాద్ మండలం నవాంద్గీ గ్రామానికి చెందిన పాండుకు ఇచ్చి వివాహం చేశారు. ఐదేళ్ల నుంచి భర్త కనిపించడం లేదు. దీంతో భారతి తల్లిగారి ఊరు ఓగిపూర్‌లో ఉంటోంది. ఈమెకు కూతురు అర్చన(13), కొడుకు మల్లేష్(9) ఉన్నారు. ఐదేళ్లు వచ్చే వరకు ఇద్దరూ బాగానే ఉండేవారు. ఆ తర్వాత ఒక్క సారిగా జ్వరం వచ్చి నడవలేని స్థితికి చేరారు. పిల్లల్లో ఎదుగుదల లోపించిందని తల్లి ఆవేదన చెందుతోంది. లివర్ సంబంధిత వ్యాధిలో బాధపడుతున్న భర్త పాండును లాక్ డౌన్‌కు ముందు ఆస్పత్రిలో చేర్పించింది.
అప్పటి నుంచి ఇంటికి రాలేదని, ఉన్నడో.. చనిపోయాడో తెలియడం లేదని భారతి బోరున విలపిస్తోంది. ప్రస్తుతం పిల్లలిద్దరిని తన తల్లి ఎల్లమ్మ వద్ద ఉంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. దివ్యాంగులైన పిల్లలకు పింఛన్ వస్తే కొంత మేలు జరుగుతుందని భావిస్తోంది. పింఛను మంజూరు కావాలంటే సదరం సర్టిఫికెట్ తప్పని సరి అని అధికారులు చెప్పడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి తన ఇద్దరు పిల్లలకు సదరం సర్టిఫికెట్ ఇప్పించి పెన్షన్ వచ్చేలా చూడాలనిభారతిదీనంగా వేడుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment