స్త్రీ, శిశు సంక్షేమానికి ప్రాధాన్యం
- గర్భిణులకు, బాలింతలకు నాణ్యమైన పోషకాహారం
- అధికారులకు మంత్రి పీతల సుజాత ఆదేశాలు
విశాఖ రూరల్: వచ్చే ఏడాదికల్లా మాతా, శిశు మరణాలు పూర్తి స్థాయిలో తగ్గేలా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖమంత్రి పీతల సుజాత ఆదేశించారు. శనివారం ఆమె కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమం, గనులు, భూగర్భ వనరుల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్, ఎమ్మెల్యేలు పీలా గోవింద సత్యనారాయణ, వంగలపూడి అనిత ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుజాత మాట్లాడుతూ స్త్రీ, శిశు సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వ అందిస్తున్న పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందేలా అధికారులు శ్రద్ధ చూపాలని సూచించారు.
మాతా, శిశు మరణాలు తగ్గించాలన్న లక్ష్యంతో నిరుపేదలకు అంగ న్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అయితే సరఫరాలో పలు అక్రమాలు జరుగుతున్నట్టు తనకు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. కేంద్రాల్లో మెనూ ప్రకారం గర్భిణులు, బాలింతలు, శిశువులకు నాణ్యమైన పోషకాహారాన్ని సరఫరా చేయాలని, సరఫరాలో ఎలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
అంగన్‌వాడీలకు భవనాలు: మంత్రి అయ్యన్న
మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద అంగన్‌వాడీ భవనాలు మంజూరు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం అక్టోబర్ 2 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్విహంచనున్నట్లు తెలిపారు. ఇందులోభాగంగా అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలకు అవసరమైన మరుగుదొడ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిని పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. 2500 అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవని, 1700 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఏజేసీ వై.నరసింహారావు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆర్‌జేడీ పి.అనసూయ, పీడీ ఎ.ఇ.రాబర్ట్స్, ఏపీడీ చిన్మయిదేవి తదితరులు పాల్గొన్నారు.