ప్రాణం తీసిన డబ్బుల గొడవ
మూడు నెలల్లో కూతురు పెళ్లి జరగనుండడంతో ఆ ఇల్లాలు ఫైనాన్స్ వ్యాపారి వద్ద చీటీ వేసింది. పెళ్లి అవసరాలకు డబ్బు కావాలని ఆ వ్యాపారి వద్దకు వెళ్తే.. తీరా లేవు పొమ్మన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరిస్తే.. చెబితే భయమా? ఫిర్యాదు చేసుకుంటే చేసుకో.. అంటూ తెగేసి చెప్పాడు. పైగా తానూ వస్తానంటూ ఆమెను తన ద్విచక్రవాహనంపైనే ఎక్కించుకుని పోలీసు స్టేషన్‌కు బయలుదేరాడు. అలా వెళ్తుండగా మళ్లీ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవలో ఏమైందో ఏమో ఆమె బండి నుంచి జారిపడిపోయింది. ‘ఆమె పోతే డబ్బులు ఇవ్వనవసరం లేద’నుకున్నాడో ఏమో.. రోడ్డుపైనే నిర్దాక్షిణ్యంగా వదిలేసి పోయాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రిలో చేర్చినా ఫలితంలేకపోయింది. చివరికి ప్రాణం పోయింది.
పలాస: కాశీబుగ్గ మహారాణిపేటకు చెందిన బీమా రూపావతి(45) ద్విచక్రవాహనంపై నుంచి జారిపడి గురువారం మృతి చెందారు. ఫైనాన్స్ వ్యాపారి ప్రకాశరావుతో స్కూటీపై వెళ్తుండగా బండిపై నుంచి జారిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ కథనం ప్రకారం... మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమార్తె సంతోషిణి(19)కి ఇటీవల వివాహం నిశ్చయమైంది. జనవరి 26న పెళ్లి జరగనుంది. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా డబ్బు అవసరం కావడం తో తనకుమార్తె సంతోషిణి, కుమారుడు సంతోష్‌తో కలిసి చినబాడాంలోని ప్రకాశరావు ఫైనాన్స్ కార్యాలయానికి ఉదయం 9.30 గంటలకు వెళ్లింది. ప్రకాశరావు వద్ద చీటీ కట్టిన సొమ్ము ఉండడంతో అందులో నుంచి రూ.50 వేలు కావాలని కోరారు ప్రస్తుతం డబ్బులు లేవని ప్రకాశరావు చెప్పడంతో రూపావతి, ప్రకాశరావుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తానని చెప్పగా, తాను కూడా వస్తాను పదా అం టూ తన స్కూటీపై తీసుకుని వెళ్లాడు.
అయితే స్కూటీని కాశీబుగ్గ వైపు కాకుండా దారిమళ్లించి బెండి రైల్వేగేటు వైపు తీసుకెళ్తుండగా, ఇలా వెళ్తున్నావేంటి అంటూ బండిమీద ఆమె గొడవ చేశారు. బం డి అలా వెళ్తుండగా గరుడఖండి, సరియాపల్లి గ్రా మాల మధ్య జాతీయ రహదారికి సమీపంలో రూపావతి జారిపడిపోయారు. దీంతో ఆమె తలకు బల మైన గాయాలు తగిలాయి. ప్రాణాపాయస్థితిలో ఉన్న రూపావతిని ప్రకాశరావు పట్టించుకోకుండా అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ విషయం కుటుంబీకులకు తెలియడంతో రూపావతిని పలాస ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె మృతి చెందారు. కుమార్తె సంతోషిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ చెప్పా రు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.