కష్టాలే కాటేశాయి! | Women farmers committed suicide due to debt distress | Sakshi
Sakshi News home page

కష్టాలే కాటేశాయి!

Published Tue, Oct 27 2015 11:08 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

కష్టాలే కాటేశాయి! - Sakshi

కష్టాలే కాటేశాయి!

అప్పుల బాధ వల్లే మహిళ  రైతు ఆత్మహత్య
అక్కిరెడ్డిపాలెంలో దర్యాప్తు  
{ధువీకరించిన రెవెన్యూ అధికారులు

 
అనకాపల్లి: కలిసి రాని సాగు.. అందని కౌలు రైతు చట్టాల ఫలాలు.. క్షీణిస్తున్న కుమారుని ఆరోగ్యం.. కుటుంబ పోషణలో భాగస్వామి కాలేకపోతున్న భర్త.. ఏయేటికాయేడు పెరిగిపోతున్న అప్పులు ఆ మహిళా రైతును కుంగదీశాయి.  మరణమే శరణ్యం అనుకొంది. అందరిలోనూ కలగొలుపుగా, మహిళ అయినా కుటుంబానికి పెద్దదిక్కుగా మారిన అక్కిరెడ్డిపాలెం మహిళా రైతు నారపిన్ని కాసులమ్మ(45) తన కుటుంబీలకు దిక్కుమొక్కు లేకుండా చేసి బలిదానం చేసుకొంది.  మహిళా రైతు ఆత్మహత్య ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్ఫుటం చేసింది.  ఒక సగటు కుటుంబం పడుతున్న బాధలకు ప్రభుత్వం ఏ మాత్రం బాసటగా నిలవలేదని చెప్పేందుకు  కాసులమ్మ ఆత్మహత్య ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.   రుణమాఫీ అమలుకాక,   హుద్‌హుద్ తుఫాన్ నష్టపరిహారం నేటికీ అందక, సాగు గిట్టుబాటుకాక  రైతులు అల్లాడుతున్నా   ఇప్పటి ప్రభుత్వానికి, పాలకులకు పట్టటం లేదని చెప్పేందుకు ఈ ఉదంతం ఒక మచ్చుతునక.  
 కుటుంబానికి పెద్ద దిక్కు : నారపిన్ని కాసులమ్మ జీవన శైలి ఒక ఆదర్శనీయం. కంటి చూపు మందగించిన భర్తకు చేదోడు వాదోడుగా నిలిచింది. కిడ్నీ రోగంతో బక్కచిక్కిపోతున్న కొడుకు బాధలను సైతం తన భుజాన వేసుకొంది.

మహిళే అయినప్పటికీ పొద్దున నుంచి పొద్దే ఎక్కే వర కూ కుటుంబ పోషణకు అంకితమైన ఆ  తల్లి కష్టాల ముంది ఓడిపోయి బలవన్మరణం పొందింది. కాసులమ్మ భర్త   అప్పారావు ఇటీవల కాలంలో కంటి చూపు మందగించింది. అదే సమయంలో ఒక్కాగానైన ఒక్క కుమారుడు కిడ్నీలో సమస్య కారణంగా నెల రోజుల నుంచి ఆస్పత్రిలో వైద్యం కోసం తరచూ వెళ్లి రావాల్సి వస్తోంది. కాసులమ్మ ఇద్దరు కుమార్తెలు పెళ్లి చేసింది. కొడుకుకు ఆరోగ్యం బాగోకపోవడంతో కోడలితో కలిసి పాడి మీద దృష్టి పెట్టింది. ఇటీవల వారికున్న 90 సెంట్ల భూమిలో 20 సెంట్లు విక్రయానికి సిద్ధపడి అడ్వాన్స్ తీసుకున్నారు.  ఆన్‌లైన్ భూమి వివరాలు నిక్షిప్తం కాకపోవడంతో రిజిస్ట్రేషన్ అవలేదు. అప్పటికే ఉన్న రూ. 10 లక్షల  అప్పులో మూడు లక్షలు అడ్వాన్స్ తీసుకోవడం ద్వారా చెల్లించింది. ఒక వైపు అప్పు బెంగ, మరో వైపు భర్త కంటి చూపు మందగించడం, కుమారుని కిడ్నీ సమస్య ఇలా అన్ని వైపులా చుట్టుముట్టిన సమస్యలతో ఇక తట్టుకోలేక సోమవారం     పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

 తహశీల్దార్ దర్యాప్తు: కాసులమ్మ మృతిపై దర్యాప్తు జరిపేందుకు తహశీల్దార్ భాస్కర్ రెడ్డి మంగళవారం ఉదయం అక్కిరెడ్డిపాలెంలోని మృతురాలి ఇంటి వద్దకు వెళ్లారు. అధికారికంగా రెండున్నర లక్షల రూపాయిల అప్పున్నట్లు తహశీల్దార్‌కు ప్రామసరీ నోట్లు లభించాయి. అప్పుల వెతల వల్లే మహిళా రైతు కాసులమ్మ ఆత్మహత్యకు పాల్పడిందని తహశీల్దార్ ధ్రువీకరించారు.
 
 ప్రభుత్వం ఆదుకోవాలి

 కాసులమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. సాగు కలిసిరాకపోవడం, ఏడు లక్షల రూపాయిల అప్పు ఆమెను కుంగదీశాయి.  ఆమె మరణం  భర్త అప్పారావు, కుమారుడు శ్రీనివాసరావులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కౌలుదారుగా ఆమెను గుర్తించి ప్రభుత్వం  కుటుంబానికి న్యాయం చేయాలి.       - బుద్ద శ్రీను,
 వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement