తుందుర్రు (పశ్చిమగోదావరి జిల్లా): ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు, పరిసర గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్వాఫుడ్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ 30 గ్రామాల ప్రజలు బుధవారం ఆందోళన బాటపట్టారు. అక్వాఫుడ్ పార్క్ నిర్మాణం జరిగితే ఫ్యాక్టరీ నుంచి విష రసాయనాలు వచ్చి పంట కాలువలు, పంట పొలాలు దెబ్బతినే అవకాశం ఉండటంతో గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ పార్కు నిర్మాణం చేపట్టొద్దని పెద్దఎత్తున నినాదాలు చేశారు.
తుందుర్రు గ్రామం పోలీస్ పహారాలో ఉంది. 1100 మంది పోలీసులతో భారీ భద్రతను చేపట్టారు. 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అక్వాఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమానికి ప్రజాసంఘాలు, వైఎస్సార్‌సీపీ, సీపీఎం మద్దతు తెలిపాయి. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. వందలాది మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మహిళా పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి నర్సాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాం, నాయకులు త్రిమూర్తులు, పెద్దిరాజు, పూర్ణ, పోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కె.బేతపూడి, జొన్నలగరువు, తుందుర్రు గ్రామాల్లో అడుగడుగునా పోలీసులను మోహరించారు. ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడే పరిసస్థితి నెలకొంది. దీంతో గ్రామంలోని ప్రధాన రహదారులు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. భీమవరం, పాలకొల్లు, నరసాపురం తదితర ప్రాంతాల‍్లో వైఎస్సార్‌సీపీ నేతలను ఎక‍్కడికక‍్కడ గృహనిర‍్భందం చేశారు. ప్రతి గ్రామంలోనూ పోలీసులు భారీగా మోహరించారు. ఎవరినీ బయటకు రానివ‍్వలేదు.