స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్న మహిళలు, కుటుంబ సభ్యులు
వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం: ‘స్టేషన్ పరిధిలో ఎంతో మంది మట్కా కంపెనీలు నిర్వహిస్తున్నారు.. అయినా వారిని పోలీసులు పట్టించుకోలేదు.. అయితే మట్కా రాస్తున్నారనే కారణంతో మా పిల్లలను నలుగురిని వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. వారిని కోర్టులో హాజరు పరచకుండా రూ. 2 లక్షలు డబ్బు తీసుకొని రావాలంటూ 15 రోజుల నుంచి సీఐ ఈశ్వరరెడ్డి బెదిరిస్తున్నారు..’ అంటూ మహిళలు ఆదివారం పెద్ద ఎత్తున ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. హైదర్‌ఖాన్ వీధి, కేహెచ్‌ఎం స్ట్రీట్‌కు చెందిన షేక్ కరిముల్లా, సర్ఫరాజ్, యర్రబల్లి ఖాజా, గయాజ్ మట్కా రాస్తున్నారనే కారణంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు పట్టుకొని 15 రోజులు అవుతోందని, అయినా కేసు పెట్టకుండా రోజూ స్టేషన్‌కు తిప్పుకుంటున్నారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ వారి కుటుంబ సభ్యులు, వీధిలోని మహిళలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.
రూ. లక్షలు ఎక్కడి నుంచితెస్తారు..?
మట్కా రాయడం తప్పేనని, అయితే కేసు రాసి కోర్టులో హాజరు పరచాల్సిన పోలీసులు తమ అదుపులోనే పెట్టుకున్నారని మహిళలు ఆరోపించారు. స్టేషన్ పరిధిలోనే పెద్ద పెద్ద మట్కా కంపెనీ నిర్వాహకులు ఉన్నారని, వారిని పట్టుకోకుండా రూ. 2 లక్షలు డబ్బు తీసుకొని రావాలని సీఐ ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. కూలి, నాలీ చేసుకొని జీవించే యువకులు రూ. లక్షలు ఎలా తెస్తారని వారన్నారు. కోర్టుకు పెట్టమని అడిగితే కేసులో రూ. 1.06 లక్షలు, స్టేషన్‌కు రూ. 1 లక్ష ఇవ్వాలని డిమాండు చేస్తున్నారని తెలిపారు. శనివారం రాత్రి స్టేషన్‌లో ఉన్న నలుగురికి అన్నం కూడా పెట్టలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలియడంతో స్థానిక మైనార్టీ నాయకుడు వైఎస్ మహమూద్‌తో పాటు మరి కొందరు స్టేషన్ వద్దకు వచ్చారు. అక్కడికి వచ్చిన డీఎస్పీ సుధాకర్‌తో మాట్లాడారు. తర్వాత డీఎస్పీ మహిళలతో మాట్లాడి న్యాయం చేస్తానని చెప్పారు.
ఎస్పీ విచారణ ?
మట్కా కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన సంఘటనలో ఆరోపణలు రావడం, కేసులోని నిందితుల బంధువులు, మహిళలు పెద్ద ఎత్తున వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఆందోళన చేయడాన్ని జిల్లా ఎస్పీ అన్బురాజన్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు స్థానిక పోలీసు అధికారులతో ఎస్పీ మాట్లాడినట్లు తెలుస్తోంది.పోలీసుల అదుపులో ఉన్న నలుగురిని ఆదివారం కడపకు తీసుకొని వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. వీరిని ఎస్పీ స్వయంగా విచారణ చేసినట్లు తెలిసింది. ఎస్పీ ఎదుట నలుగురు చెప్పే సమాధానంపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ అధికారుల భవితవ్యం ఆధారపడి ఉంది. పోలీసు అధికారులు డబ్బు డిమాండు చేశారని నలుగురు చెబితే మాత్రం కచ్చితంగా శాఖాపరమైన చర్యలు ఉంటాయని పోలీసు వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
కేసు నమోదు చేశాం..
కరిముల్లా, సర్ఫరాజ్, యర్రబల్లి ఖాజా, గయాజ్‌తో పాటు ప్రధాన మట్కా నిర్వాహకుడు ఖదీర్‌పై శనివారం కేసు నమోదు చేశాం. నలుగురి కోసం కుటుంబ సభ్యులు వస్తే జామిన్ ఇచ్చి పంపించాలనుకున్నాం. కానీ ఎవ్వరూ రాలేదు. ఈ లోపే అందరూ స్టేషన్ వద్దకు వచ్చారు. ఇటీవల వైఎస్ మహమూద్‌పై రెండు కేసులు నమోదు చేశాం. అందువల్లనే అతను స్టేషన్ వద్దకు వచ్చి రాద్ధాంతం చేశాడు. డబ్బు ఇవ్వాలని ఎవ్వరినీ డిమాండు చేయలేదు. – ఈశ్వరరెడ్డి, వన్‌టౌన్ సీఐ, ప్రొద్దుటూరు.
Comments
Please login to add a commentAdd a comment