మూడు దశాబ్దాలుగా మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. అయితే వారి ఆరోగ్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. జిల్లాలో 20.57 లక్షల మంది మహిళా జనాభా ఉంటే 16 ఏళ్లు పైబడినవారిలో 90 శాతం స్త్రీలు వివిధ రంగాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిలో 75 వేల మంది వరకూ ప్రభుత్వ/ ప్రయివేటు రంగాల్లోని ఉద్యోగాల్లో ఉన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులుగా 6.50 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం పనిచేస్తోన్న ఉపాధి హామీ పథకం కూలీల్లో 2.10 లక్షల మంది మగవారుంటే 2.30 లక్షల మంది ఆడవారు ఉన్నారు. అంటే 20 వేల మంది అధికంగా మగవారికంటే ఉపాధి కూలీలు ఉన్నారు. అసంఘటిత రంగంలోనూ మహిళ చెయ్యిపడితే గానీ పనులు పూర్తవ్వని పరిస్థితి. దీంతో గత 30 ఏళ్ల కాలంలో మారుతున్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో భార్యా భర్తలు ఇద్దరూ ఉపాధి మార్గాన్ని ఎంచుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో శారీరక, మానసిక శ్రమ పెరిగి మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించలేకపోతున్నారు.
పోషకాహార నివేదిక ఫలితాలు ఇవి..
మనదేశంలో మహిళల ఆరోగ్యం చాలా దారుణంగా ఉందని ప్రపంచ పోషకాహార నివేదిక –2017 వెల్లడించింది. దేశంలోని 51 శాతం మంది మహిళలు రక్త హీనతతో బాధపడుతున్నారని, ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఈ విషయంలో భారత్ తొలిస్థానంలో నిలిచిందని పేర్కొంది. ఇందులో చైనా, పాకిస్థాన్, నైజీరియా, ఇండోనేషియా కంటే ఇండియా అట్టడుగు స్థానానికి చేరింది. అంతేకాదు ప్రతి ఐదుగురు భారతీయ మహిళల్లో ఒకరు. ఊబకాయంతో బాధపడేవారేనని తేలింది. పోషకాహారలోపంతో రక్తహీనత, అధిక బరువు సంబంధించిన వ్యాధులతో సతమతమవుతున్నట్టు తెలియజేసింది.
చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేదు
జెనీవాలో నిర్వహించిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో 140 దేశాల్లోని మహిళల ఆరోగ్య స్థితిగతులను విశ్లేషించారు. మహిళల్లో రక్తహీనత, పోషకాహార లోపం గుర్తించి వాటి నివారణకు భారత ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలు ద్వారా చర్యలు తీసుకుంటున్నా ఎలాంటి ఫలితం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. యుక్త వయసున్న మహిళల్లో రక్తహీనత స్థాయి అధికంగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. 2016 నాటికి ఇండియాలో రక్తహీనతతో బాధపడే మహిళల సంఖ్య 48 శాతంగా ఉందని పేర్కొంది. ఈ శాతం ఇలా ఏటా పెరిగితే ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
గ్రామీణ మహిళల్ని వణికిస్తున్న రక్త పోటు
గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీలు రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్టు ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’లో వెల్లడైంది. ఒత్తిళ్ల కారణంగా పల్లెవాసులు, పోషకాలు లేని ఆహారం వల్ల పట్టణ ప్రాంతాలవారు పలురకాల వ్యాధులకు లోనవుతున్నారని ఆ సర్వే తేల్చి చెబుతోంది. 2016లో విడుదల చేసిన జాతీయ ఆరోగ్యసర్వేలో 15 రాష్ట్రాలకు సంబంధించి పల్లె, పట్టణ ప్రాంత మహిళల్లో 45.6 శాతం అధిక బరువు కలిగి ఉన్నారు. దేశం మొత్తం మీద చూస్తే ఊబకాయం కలిగిన మహిళలు అంధ్రప్రదేశ్‌లోనే అధికం. రాష్ట్రంలో పల్లెల్లో 27.6 శాతం మంది అధికబరువుతో సతమతమవుతున్నారు. గ్రామీణ మహిళల్లో ఒత్తిడికి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు, వైద్య సౌకర్యాలు లేకపోవడం, గిట్టుబాటు కాని వ్యవసాయంపైనే ఆధారం, ఆహారధాన్యాలు, పండ్లు, కూరగాయల ధరలు అందుబాటులో లేకపోవడంతో అన్ని ప్రాంతాల వారు నాణ్యమైన పోషకాహారానికి నోచుకోవడం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఎన్నో సమస్యలు..
మహిళల్లో చిన్న వయసు నుంచే గ్యాస్టిక్ ట్రబుల్, కడుపు నొప్పి, మంట ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోషకాహారలోపం వల్ల హార్మోన్ల సమస్యతో 8, 9 సంవత్సరాలకే రుతుస్రావం ప్రారంభం కావడం, అధిక రక్త స్రావం సంభవిస్తన్నాయి. 10–20 రోజులకే రుతుస్రావం రావడం జరుగుతోంది. అలాగే మైగ్రేయిన్, కంటి సమస్యలు, గర్భసంచి సమస్యలు, నరాల నీరసం, డిప్రెషన్‌తో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
ఒత్తిడితో ఉద్యోగినుల్లో ఆరోగ్య సమస్యలు
ఉద్యోగాలు చేసే మహిళలు విపరీతమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటుండటంతో.. 68 శాతం మంది పలు రకాల వ్యాధుల బారిన పడుతున్నట్టు అసోచామ్ సర్వే తెలిపింది. ‘ప్రివెంటివ్ హెల్త్ కేర్ అండ్ కార్పొరేట్ ఫిమేల్ వర్క్ ఫోర్స్’ అనే అంశంపై ఆ సంస్థ సర్వే చేపట్టింది. 68 శాతం మంది ఉద్యోగినులు స్థూలకాయం, డిప్రెషన్, తీవ్రమైన నడుంనొప్పి, మధుమేహం, హైపవర్ టెన్షన్ లాంటి వ్యాధులు బారినపడుతున్నారని తెలిపింది, ప్రయివేటు రంగంలో విపరీతమైన పని ఒత్తిడి, డెడ్‌లైన్లు ఉండటం వల్ల ఉద్యోగినుల్లో 53 శాతం మంది తిండి మానేయడం లేదా చిరుతిళ్లకు అలవాటు పడటం ఎక్కువైనట్టు తెలిపింది. ఉద్యోగినులు పారిశ్రామిక కాలుష్యానికి గురికావడం, నిద్రలేమి, సరైన వ్యాయామం లేకపోవటం, అసలు సూర్యరశ్మి అనేదే తగలక పోవడంతో వారి ఆరోగ్యం క్షీణించడానికి కారణమని తెలిపింది. ఇంట్లో చిట్కా వైద్యాలతో సరిపెడుతున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉందని, వ్యాధిని ముందుగా గుర్తించక ఆలస్యం చేసి శస్త్రచికిత్సల వరకూ తెచ్చుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు. ఈ క్రమంలో స్త్రీలకు ఆరోగ్య బీమా అవసరం అని నిపుణులు పేర్కొంటున్నారు.
ఆహారమే ఔషధం
ఎక్కువ మంది రక్తహీనత, రక్తపోటుతో ఇబ్బందులు పడుతున్నారు. తాజా పసుపు, ఎరుపు రంగులో ఉండే పండ్లు, కూరగాయల్లో కెరొటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అవకాశాలు తగ్గుతాయి. కాలీప్లవర్ ద్వారా విటమిన్–బి లభిస్తుంది. వీటిని గర్భిణులు తీసుకుంటే ప్రసవసమయంలో కావల్సిన శక్తి లభిస్తుంది. మసాలాలకు, జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
– ఎస్.అర్చన, స్త్రీల వైద్య నిపుణులు, ఉంగుటూరు
శారీరక శ్రమ తగ్గింది
గత 20 ఏళ్లుగా స్త్రీల విషయంలో శారీరక శ్రమ తగ్గింది. గతంలో పల్లెల్లో కూరగాయలు, పండ్లు సొంతంగా సాగు చేసుకునేవారు. బియ్యం దంచడం, పప్పు రుబ్బడం వంటి పనులే ప్రస్తుతం లేవు. పైగా టీవీలలో మహిళల్నే టార్గెట్ చేస్తూ వారిని భావోద్వేగాలకు లోను చేసే సీరియల్స్ పెరిగాయి. తినే ప్రతి ఆహార పదార్థం కల్తీ. సరైన పోషకాహారం దొరకక అనారోగ్యాల పాలవుతున్నారు.
–శరణాల మాలతీరాణి, నారాయణపురం
Comments
Please login to add a commentAdd a comment