కూలీల‌ను ఆదుకునేందుకు ప్రభుత్వ ఏర్పాట్లు | Work Under MGNREGA Will Start In Andhra Pradesh On New Lockdown Rules | Sakshi
Sakshi News home page

ఉపాధి హామీతో గ్రామీణ కూలీలకు ప్రభుత్వ భరోసా

Published Mon, Apr 20 2020 2:06 PM | Last Updated on Mon, Apr 20 2020 2:11 PM

Work Under MGNREGA Will Start In Andhra Pradesh On New Lockdown Rules - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించింది. కరోనా వైరస్ నియంత్రణ‌లో భాగంగా అమల‌వుతున్న లాక్‌డౌన్ వ‌ల్ల‌ పనులు లేక అల్లాడుతున్న పేదల ఆర్థిక కష్టాలకు చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. ఉపాధి హామీ కింద వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇస్తూ, వేతనాల ద్వారా కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప్రధానంగా ఉద్యాన పంటలు, మల్బరీ తోటల పెంపకం, పశు గ్రాస పెంపకం వంటి వాటికి ప్రాధాన్యతనివ్వ‌గా, దీనితో పాటు కాలువలు, చెరువుల తవ్వకం వంటి ఇతర సామాజిక పనులను స్థానిక డిమాండ్ ఆధారంగా చేపట్టాలని అధికారులు నిర్ధేశించారు.

అయితే ప‌నులు చేసే కూలీలు ఖచ్చితంగా భౌతిక దూరంతో పాటు కరోనా వ్యాప్తి నిరోధ‌క నిబంధనలను త‌ప్ప‌నిస‌రిగా పాటించాలని ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రకటించింది. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలకు అనుగుణంగా ఉపాధి హామీ కూలీలు నడిచి వెళ్ళే దూరంలోనే సాధ్యమైనంత వరకు పనులు కల్పించనున్నారు. ఉపాధి హామీ కూలీలకు చెల్లించటానికి నిధులకు ఎలాంటి కొరత లేనందున గ్రామాల్లో పనులు కల్పించడం, గ్రామీణ పేదలకు ఆర్థిక చేయూతను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా కల్లెక్టర్లను, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ల‌ను ఆదేశించింది. (ఆర్థిక ఇబ్బందుల్లోనూ 'సున్నా వడ్డీ')

ఉపాధిహామీ కూలీలకు అదనంగా 30 శాతం వేసవిభత్యం  
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు నరేగా నిబంధ‌నల ప్రకారం చెల్లిస్తున్న కూలితో పాటు అదనంగా వేసవి భత్యం అందచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య ఉపాధి హామీ కూలీలు గరిష్ట కూలీని పొందే స్థాయిలో పనులు చేయలేని పరిస్థితి వుంటుంది. దానిని దృష్టిలో పెట్టుకుని వారు చేసిన కూలీకి అదనంగా ముప్పై శాతం వరకు వేసవి భత్యంను పొందేందుకు వీలు కల్పించారు. దీనివల్ల ఉపాధి హామీ కూలీలు గరిష్టంగా రోజుకు 237 రూపాయల వరకు కూలిగా పొందేందుకు అవకాశం వుంది. రోజువారీ వారు చేసిన పనిని లెక్కించి అందుకు అనుగుణంగా కూలీ చెల్లిస్తారు.

ఈ ఏడాది రాష్ట్రానికి అదనంగా కోటి పనిదినాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు అదనంగా కోటి పనిదినాలు లభించాయి. గత ఆర్థిక సంవత్సరంలో 20 కోట్ల పనిదినాలు మాత్రమే రాష్ట్రానికి కేటాయించగా, ఈ ఏడాది అదనంగా మరో కోటి పనిదినాలను కేటాయించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్రానికి  చెందిన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారుల ముందుచూపుతో తీసుకున్న చర్యల ఫలితంగా రాష్ట్రంలోని కూలీలకు ఈ అదనపు ప్రయోజనం లభించింది. గత ఆర్థిక సంవత్సరంలో వేతన దారులకు రూ. 20.08 కోట్ల పనిదినాలు కల్పించి రూ 4084.86 కోట్లు వేతన రూపంలో చెల్లించారు.  ఉపాధి హామీ పథ‌కం కింద గత ఆర్థిక సంవత్సరంలో మెటీరియల్ రూపంలో రూ.2624.18 లు, వేతన రూపంలో రూ.4084.86 కోట్లు కలిపి మొత్తం రూ.6709.04 లు వ్యయం చేశారు.

ఉపాధి హామీ నిధులకు కొరత లేదు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కరోనా కారణంగా దినసరి కూలీలు పనులు లేక అల్లాడుతున్న తరుణంలో వారిని ఆదుకునేందుకు ఉపాధి హామీ పనులను ప్రభుత్వం ముందుకు తీసుకువస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు చెల్లించేందుకు నిధుల కొరత లేదని వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లించే వేతనాల కోసం 2020-21 ఆర్ధిక సంవత్సరంకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.2149.78 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. ఉపాధి హామీ కోసం ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో ఈనెల 15వ తేదీ వరకు ప్రభుత్వం ఉపాధి కూలీలకు వేతనాల రూపంలో రూ. 494.3 కోట్లు చెల్లించగా జూన్ వరకూ చెల్లించటానికి మరో రూ.1688.97 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. 2019-2020 లో రూ. 211 గా ఉన్న దినసరి వేతనాన్ని 2020-21 లో అదనంగా రూ.26లు పెంచి రోజుకి రూ. 237 లు చొప్పున చెల్లించటం జరుగుతుందన్నారు. తద్వారా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రూ. 546 కోట్లు అదనంగా రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు వేతన రూపంలో అందుతుందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement