ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఆందోళనకు దిగిన కార్మికులు
పశ్చిమగోదావరి , పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో గేట్లు అమర్చే పనులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గాయాలపాలై ఒక కార్మికుడు మృతిచెందాడు. మరో కార్మికుడు తీవ్ర గాయాలతో రాజమండ్రి వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. పోలవరం ఎస్సై సీహెచ్ రామచంద్రరావు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం స్పిల్‌వే 32వ బ్లాక్‌లో గేట్ల పనులు జరుగుతున్నాయి. క్రేన్ సహాయంతో గేట్లు దించుతున్న సమయంలో అక్కడే పనిచేస్తున్న జార్ఖండ్ రాష్ట్రం పలామా జిల్లా హసీనాబాద్ మండలం ఉబ్రికోలన్ గ్రామానికి చెందిన భీమిలేష్ కుమార్ రామ్ (22) అనే కార్మికుడిపై రాడ్డు పడటంతో తీవ్రగాయాలపాలయ్యాడు. పోలవరం వైద్యశాలకు తరలించగా మృతిచెందాడు. 15వ బ్లాక్‌లో పనిచేస్తున్న సతీష్ అనే కార్మికుడు స్పిల్‌వే పై నుంచి జారిపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇతన్ని పోలవరం వైద్యశాలకు తరలించారు. వైద్యాధికారి సుధాకర్ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు.
కార్మికుల ఆందోళన
ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోటం వల్లే కార్మికుడు మృతిచెందాడని కార్మికులు ఆందోళనకు దిగారు. స్పిల్‌వే సమీపంలో ఉన్న నవయుగ ఏజెన్సీ క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆగ్రహంతో రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయానికి ఉన్న అద్దం, సమీపంలో ఉన్న ఒక వాహనానికి చెందిన అద్దం పగిలాయి.
అక్కడి నుంచి 150 మంది కార్మికులు నవయుగ గెస్ట్ హౌస్‌కు వెళుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సీఐ బీహెచ్ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై కె.శ్రీహరిరావు, నవయుగ ఏజెన్సీ ప్రతినిధులు అక్కడికి చేరుకుని చర్చలు జరిపారు. తమ కోసం ఎటువంటి రక్షణ, భద్రతా చర్యలు చేపట్టడం లేదని కార్మికులు తెలిపారు. కార్మికులను తీసుకువచ్చిన లేబర్ కాంట్రాక్టరుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని సీఐ, ఎస్సై, నవయుగ ఏజెన్సీ ప్రతినిధులు హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించి వెనుదిరిగారు. లేబర్ కాంట్రాక్టర్లతో కార్మికుల సమస్యలపై చర్చించినట్టు ఎస్సై రామచంద్రరావు తెలిపారు. సతీష్ అనే వ్యక్తి గాయాలై రాజమండ్రిలో చికిత్స పొందుతున్నాడని, వివరాలు రావాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment