టీడీపీ సర్కారు తీరుపై కార్మిక లోకం కన్నెర్ర
► గుంటూరు నగరంలో భారీ ప్రదర్శన, రాస్తారోకో
► కార్పొరేషన్ కార్యాలయ ముట్టడి
► కార్మికుల పొట్టకొట్టే విధానాలు అవలంబిస్తోందని ఆందోళన
► జీవో 279 రద్దుకు, జీవో 151 అమలుకు డిమాండ్
► ఆందోళనకు వైఎస్సార్‌సీపీ మద్దతు
నగరంపాలెం (గుంటూరు) : టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కార్మికుల పొట్టకొట్టే విధానాలను అమలుపరుస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్ది ధ్వజమెత్తారు. పురపాలక, నగరపాలక సంస్థల్లో పారిశుద్ధ్యం బాధ్యత ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు విడుదల చేసిన జీవో 279ని రద్దు చేయాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు పనికి సమానమైన వేతనంపై విడుదల చేసిన జీవో 151ను అమలు పరచాలని కోరుతూ మున్సిపల్ కార్మికుల జేఏసీ అధ్వర్యంలో మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మున్సిపాలిటీలో దశాబ్దాలుగా పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న బడుగు, బలహీన వర్గాలకు చెందిన కార్మికులను బడా కాంట్రాక్టర్లకు బానిసలుగా మార్చేందుకే జీవో 279ని అమలు చేస్తున్నారన్నారు.
దీనివల్ల రాష్ట్రంలో 50 వేల కార్మికుల ఉపాధి భద్రత అగమ్యగోచరంగా మారుతుందంటూ.. కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా కుట్రపూరితంగా, దురాలోచనతో బలవంతంగా జీవోను అమలు చేయాలని చూస్తున్నారన్నారు. కార్మికుల సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తొమ్మిదినెలల క్రితం జారీ చేసిన జీవో 151ని ప్రభుత్వం వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు. కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం స్పందించి కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జీవోను రద్దు చేయకపోతే ఆందోళనలను ఉధృతం చేసి ప్రభుత్వాన్ని స్తంభింపచేస్తామని హెచ్చరించారు.
రూ.లక్షల కోట్లలో పన్నుల భారం...
ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కార్మికుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 279 జీవోను అమలు చేయటం వల్ల కార్మికుల ఉపాధితో పాటు, నగర ప్రజలకు అదనపు సర్వీస్ చార్జి పేరుతో లక్షల కోట్ల రూపాయల్లో పన్నుల భారం పడుతుందన్నారు. ప్రస్తుతం పారిశుద్ధ్యం కాంట్రాక్టులు నిర్వహించే సొసైటీలకు ఐదు శాతం రాయల్టీ ఇస్తున్న ప్రభుత్వం, నూతన విధానంలో మాత్రం బడా కార్పొరేట్ కంపెనీలతో లాలూచీ పడీ ఏకంగా 15 శాతానికి పెంచేసిందన్నారు.
ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా ఆర్థిక స్తోమత లేని చిన్న చిన్న మున్సిపాలిటీలపై ఒత్తిడి తెచ్చి మరీ భారీ యంత్రాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందన్నారు. ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రస్థాయిలో అందోళన ఉధృతం చేస్తామన్నారు. సీపీఐ జిల్లా నాయకుడు నేతాజీ, ది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఈదులమూడి మధుబాబు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు.
రాస్తారోకో.. ముట్టడి
జీవో 279ని రద్దు చేయాలని కోరుతూ రీజనల్ కార్యాలయ పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు తొలుత ఏసీ కళాశాల నుంచి ర్యాలీగా నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకొని కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. కార్మికుల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చే జీవోను రద్దు చేయాలని, ప్రభుత్వ నిరంకుశ ధోరణి నశించాలని, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డౌన్‌డౌన్ అని, మంత్రులు నారాయణ, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.
రాస్తారోకోతో కార్పొరేషన్ ఎదుట మెయిన్ రోడ్డులో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వెస్ట్ డీఎస్పీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు కార్మిక నాయకులకు సర్దిచెప్పి రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం కార్మికులు కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి కొద్దిసేపు ధర్నా నిర్వమించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ జిల్లా నాయకులు బి.ముత్యాలరావు, సుధీర్, యాకోబు, సుమన్, అధిక సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.