కోడ్ కూస్తుందని..
- అధికారుల హైరానా
- నోటిఫికేషన్‌కు ముందే పనుల మంజూరుకు కసరత్తు
- రూ.100 కోట్ల పథకాలకు అవకాశం..
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ రాకముందే వేడి రాజుకుంది. రాజకీయ పక్షాలు వారి వారి వ్యూహాల్లో బిజీగా ఉండగా ఇటు అధికార యంత్రాంగం కూడా ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. దీంతోబాటు ఇటు ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఒకవైపు ఎన్నికల సిబ్బంది నియామకం, వారికి శిక్షణా తరగతులు వంటి కార్యక్రమాలపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు వచ్చే వేసవికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రజాప్రతినిధులు కూడా ప్రజలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటి వరకు గుర్తుకు రాని నియోజకవర్గ అభివృద్ధి నిధులతో కొత్త పనులు చేపట్టేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
రూ.100 కోట్లు పనులకు శ్రీకారం: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఓట్ల లెక్కింపు వరకు నియమావళి అమలులో ఉంటుంది. ఆ కాలంలో ఎటువంటి కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు ప్రారంభించే అవకాశం ఉండదు. దీంతో నోటిఫికేషన్‌కు ముందే జిల్లాలో చేపట్టాల్సిన పనులపై అధికారులు దృష్టి సారించారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేశారు. అలాగే నీటి పారుదల శాఖ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, హౌసింగ్ శాఖలకు సంబంధించి ప్రారంభించాల్సిన పనులను వెంటనే ప్రారంభించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు అన్ని శాఖలకు కలిపి మొత్తంగా రూ.100 కోట్లు విలువ చేసే పనులను ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఎన్నికల సిబ్బంది నియామకం: ఎన్నికల సిబ్బంది నియామకంపై జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికీ ఆయా ఉద్యోగుల జాబితా సిద్ధమైనట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు కలెక్టరేట్‌కు చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో నోడల్ అధికారితో పాటు సెక్టోరల్ ఆఫీసర్ నియామకాలు పూర్తయ్యాయి.
పీఓ, ఏపీఓల నియామకాలకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో 3506 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కేంద్రాల సంఖ్య కంటే పది శాతం అధికంగా 3857 మంది పీఓలను నియమించనున్నారు. ఇలా అన్ని స్థాయిల్లో కలిపి మొత్తంగా 22 వేల మంది ఉద్యోగులను వినియోగించనున్నారు. రిటర్నింగ్ అధికారుల జాబితాను ఎన్నికల సంఘానికి పంపించారు. అక్కడ ఆమోద ముద్ర లభించిన వెంటనే రిటర్నింగ్, పోలీసు అధికారులు సున్నిత, అతిసున్నిత ప్రాంతాలను గుర్తించనున్నారు.