మాఫీలో దగా.. సేద్యానికి పొగ
- చంద్రబాబుపై రైతు నాయకుల ధ్వజం
- భారం తగ్గాలనే కుయుక్తులని ఆరోపణ
- సర్కారు ఖాతాలో బీమా పరిహారంపై ఆగ్రహం
అమలాపురం/ అమలాపురం రూరల్ : ‘ప్రీమియం కట్టింది మేము. పంట నష్టపోతే పరిహారం అందుకోవాల్సింది మేము. మధ్యలో మీ పెత్తనం ఏమిటి? ఏ రైతు అడిగాడని రుణ మాఫీ ప్రకటించారు? ఇప్పుడు అమలు చేయడం కష్టంగా ఉందని ఆంక్షలు పెడుతున్నారు? మీ తరహా రుణమాఫీ పుణ్యమాని మాకు కొత్తగా రుణాలు రావడం లేదు. పాతరుణాలకు వడ్డీ చెల్లించమంటున్నారు. పెట్టుబడి రాయితీ, బీమా పరిహారాలు ఇవ్వడం లేదు. చక్కగా పనిచేస్తున్న సహకార సంఘాలు నిర్వీర్యమవుతున్నాయి.
మాఫీకి అడ్డగోలు ఆంక్షలు, నిబంధనల పేరుతో వ్యవసాయాన్ని ముంచేయాలని చూస్తున్నారా?’ అని రైతు సంఘాల ప్రతినిధులు, సహకార సంఘాల అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ధ్వజమెత్తారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి రాయితీ, బీమా పరిహారాలను చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం అమలాపురం శివారు ఈదరపల్లి జనహిత కార్యాలయంలో ఉభయ గోదావరి జిల్లాల రైతులు, సహకార సంఘాల అధ్యక్షుల సమావేశం జరిగింది. పెట్టుబడి రాయితీ, పంటల బీమా పరిహారం తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. వాటిని చెల్లించాలని డిమాండ్ చేస్తూ దశలవారీ ఉద్యమం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించా. రుణమాఫీ భారాన్ని తగ్గించుకునే కుయుక్తితో ప్రభుత్వం బీమా పరిహారాన్ని జమ చేసుకోవడం అన్యాయమని సమావేశంలో ప్రసంగించిన వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిగి రావాలంటే సహాయ నిరాకరణే శరణ్యం..
సభకు అధ్యక్షత వహించిన బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మి మాట్లాడుతూ బీమా ప్రీమియం చెల్లించిన రైతులకూ ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కోనసీమ రైతు పరిరక్షణ సమితి గౌరవాధ్యక్షుడు రంబాల బోసు మాట్లాడుతూ ప్రభుత్వం తీరు చూస్తుంటే రూ.86 వేల కోట్ల రుణమాఫీని రూ.10 వేల కోట్లకు కుదించేలా ఉందన్నారు. రుణమాఫీ తాత్సారంతో రైతులు సున్నా శాతం వడ్డీ రాయితీని కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రూ.లక్షకు రూ.13 వేల వడ్డీ భారం పడిందని, ఈ పాపం ప్రభుత్వానిదేనని అన్నారు.
వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చెప్పి తీరా ఇప్పుడు ఉద్యాన పంటలకు మాఫీ వర్తించదనడం భావ్యం కాదన్నారు. రైతులు సహాయ నిరాకరణ చేస్తేనేగాని ప్రభుత్వం దిగిరాదన్నారు. డీసీసీబీ డెరైక్టర్ గోదాశి నాగేశ్వరరావు మాట్లాడుతూ పదేళ్లు అధికారినికి దూరమైనా చంద్రబాబులో మార్పు రాలేదని, రైతులకు మేలు చేస్తానని ముంచేశారని విమర్శించారు. పదిమందికి మాఫీ చేసి 90 మందికి ఎగ్గొడతారని, ఇదేంటంటే రైతుల మధ్య తగువు పెడతారని వ్యాఖ్యానించారు.
బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి జలగం కుమారస్వామి మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట తప్పడానికి రాజకీయ నాయకులు సిగ్గు పడడం లేదని ఆక్షేపించారు. ఉద్యమిస్తేనేగాని రైతులకు మనుగడ లేదని, ఇది ప్రతి ప్రభుత్వ హయాంలోనూ తేటతెల్లమవుతోందని అన్నారు. బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు, కోనసీమ శాఖ అధ్యక్షుడు యాళ్ల వెంకటానందం, కోనసీమ రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, కార్యదర్శి వాసంశెట్టి సత్యం, ‘ఆత్మ’ చైర్మన్ బొక్కా ఆదినారాయణ, డీసీసీబీ డెరైక్టర్ యిళ్ల గోపాలకృష్ణ, మాజీ డెరైక్టర్ జున్నూరి బాబి, అమలాపురం డివిజన్ సహకార సంఘాల అధ్యక్షుల సమాఖ్య అధ్యక్షుడు గోకరకొండ విజయరామారావు, రైతు సంఘ నాయకులు అడ్డాల గోపాలకృష్ణ, రాయపురెడ్డి జానకీరామయ్య, ఉప్పుగంటి భాస్కరరావు, గణేశుల రాంబాబు, అప్పారి వెంకటరమణ, రమణాతి లక్ష్మణమూర్తి పాల్గొన్నారు.