కొండంత ధైర్యం | Y.S jagan mohan Raithu barosa yatra | Sakshi
Sakshi News home page

కొండంత ధైర్యం

Published Wed, Feb 25 2015 2:40 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

కొండంత ధైర్యం - Sakshi

కొండంత ధైర్యం

 ‘ఎన్నికల్లో నెగ్గడానికి చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటి గురించి ఆయన మరచిపోయారు. వాటిని నమ్మి ఓట్లు వేసిన జనం అష్టకష్టాలు పడుతూ భారంగా బతుకీడుస్తున్నారు. ఎవ్వరూ అధైర్య పడొద్దు. మీ వెంట నేనుంటా. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనకే తావివ్వద్దు. ఈ ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలు చేసే వరకు పోరాడుదాం’ అని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇస్తుండటంతో రైతుల్లో ధైర్యం పెరిగింది.
 
 రైతు భరోసాయాత్ర నుంచి సాక్షి ప్రతినిధి :  అప్పుల బాధ తాళలేక.. ప్రభుత్వం నుంచి భరోసా కరువై.. ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా కల్పించి నేనున్నానని ధైర్యం నింపేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న రైతు భరోసా యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ప్రతీపల్లెలోనూ ప్రజలు నీరాజనం పడుతున్నారు.
 
  పూల వర్షం కురిపిస్తూ బంతిపూలపై నడిపిస్తున్నారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి, నుదుట విజయ తిలకం దిద్ది దీవిస్తున్నారు. ప్రతీపల్లెలో యువకులు, రైతులతో పాటు భారీ సంఖ్యలో మహిళలు రోడ్లపైకి వచ్చి జగన్‌ను చూసి సంబరపడ్డారు. ప్రభుత్వ వైఖరితో మోసపోయి, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి దిగాలుగా ఉన్న తమ కుటుంబాల్లో భరోసా నింపేందుకు వచ్చిన జగన్‌ను చూసి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబీకులతో పాటు యాత్రసాగే దారిలోని ప్రతీ గ్రామంలోని రైతులు, మహిళలు గర్విస్తున్నారు.
 
 యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. సోమవారం రాత్రి అనంతపురంలోని ముత్యాలరెడ్డి అతిథి గృహంలో బస చేసిన జగన్.. మంగళవారం ఉదయం 9.50 గంటలకు యాత్రను ప్రారంభించారు. సిండికేట్‌నగర్, లెప్రసీ కాలనీ మీదుగా రాచనపల్లికి చేరుకున్నారు. గ్రామం దాటగానే పుట్లూరు మండలానికి చెందిన రైతులు జగన్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోతున్నాయని, తద్వారా చీనీచెట్లు నిలువునా ఎండిపోతున్నాయన్నారు. పింఛన్ల పంపిణీలో కూడా తమ మండలంలో అర్హులకు అన్యాయం జరుగుతోందని విన్నవించారు. తర్వాత బ్రాహ్మణపల్లి మీదుగా కూడేరు చేరుకున్నారు. జగన్‌ను చూసేందుకు ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు, బెళుగుప్ప నుంచి భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. రైతులు, మహిళలతో కూడేరు సర్కిల్ కిక్కిరిసింది.

 కూడేరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆపై తనను చూసేందుకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికలకు ముందు ఒకమాట...గద్దెనెక్కిన తర్వాత మరోమాట మాట్లాడుతూ రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు వైఖరిపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. అక్కడి నుండి అంతరగంగ చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు దంపతులు నేసే వన్నూరప్ప(58), నారాయణమ్మ(50) కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యుల కష్టసుఖాలను అడిగి తె లుసుకున్న తర్వాత అక్కడి నుండి అరవకూరు, కమ్మూరు, కోటంక మీదుగా మర్తాడుకు చేరుకున్నారు. ఈ మూడు గ్రామాల్లో జనాభిమానం మధ్య ఇరుక్కుపోయిన జగన్ మర్తాడుకు వచ్చేందుకు చాలా సమయం పట్టింది. మూడు పల్లెలు దాటేందుకు నాలుగు గంటలకుపైగా సమయం పట్టిందంటే అభిమాన తాకిడి ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. రాత్రి 8.50 గంటలకు మర్తాడు చేరుకున్నారు.
 
 మర్తాడులో బ్రహ్మరథం
 మర్తాడు గ్రామస్తులు రోడ్లను బంతిపూలతో నింపారు. జగన్ చూసేందుకు దాదాపు కిలోమీటరు మేర రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డారు. మహిళలు, యువకులు మిద్దెలపైకి ఎక్కి నిలుచున్నారు. జగన్ రాగానే పూల వర్షం కురిపించారు. మర్తాడు ప్రజల అభిమానంతో జగన్ తడిసి ముద్దయ్యారు. రైతు ఆకులేటి తాతిరెడ్డి కుటుంబీకులు వారి స్థలంలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్పటి వరకూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన కళాకారులు వైఎస్‌పై పాటలు పాడారు. పాటలు విని జననేత జగన్ ఆనందించారు. అనంతరం గ్రామస్తులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు తాతిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడ నుండి శింగనమల మండలం లోలూరుకు చేరుకున్నారు.
 
  అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు గోవిందరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్‌చాంద్‌బాషా, శింగనమల కోఆర్డినేటర్ జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, జిల్లాలోని పలు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు నవీన్ నిశ్చల్, ఉషాచరణ్, వీఆర్‌రామిరెడ్డి, రమేశ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు తాడిమర్రి చంద్రశేఖరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సీపీ వీరన్న, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయసుశీలమ్మ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మైనుద్దీన్, బోయతిరుపాల్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండిపరుశురాం, ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి జయరాంనాయక్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ధనుంజయ యాదవ్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటచౌదరి, ట్రేడ్‌యూనియన్ అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి లింగారెడ్డి, సేవాదల్ జిల్లా అధ్యక్షుడు మిద్దె భాస్కర్‌రెడ్డి, అనంతపురం నగర అధ్యక్షురాలు శ్రీదేవి, జిల్లా కార్యదర్శి కష్ణవేణి, షమీమ్, పసుపులేటి బాలకష్ణారెడ్డి తదితరలు పాల్గొన్నారు.
 
 నాలుగోరోజు
 భరోసా యాత్ర ఇలా..
  రైతు భరోసా యాత్ర నాలుగోరోజు వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్  తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ వెల్లడించారు. బుధవారం ఉదయం గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం ఎద్దులపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు వన్నరప్ప కుటుంబాన్ని పరామర్శిస్తారన్నారు. అదే మండలంలోని అనుపంల్లిలో ఆత్మహత్య చేసుకున్న మరో రైతు ఓబన్న కుటుంబాన్ని పరామర్శిస్తారని వెల్లడించారు.
 
 తాతిరెడ్డికి అభినందనలు
 వైఎస్ విగ్రహాన్ని స్థాపించిన ఆకులేటి తాతిరెడ్డిని జగన్ అభినందించారు. ఈ ప్రభుత్వంలో వైఎస్ విగ్రహాలను టీడీపీ నేతలు పగలగొడుతున్నారని ఆరోపించారు. అయితే వైఎస్‌పై ఎంతో ప్రేమతో కలెక్టర్, చంద్రబాబు ఎవ్వరూ అనుమతి ఇవ్వకపోయినా తన స్థలంలో తాతిరెడ్డి.. వైఎస్ విగ్రహాన్ని స్థాపించారని కొనియాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement