శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దోచుకొని..దాచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి అరోపించారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నవంబర్ 6వ తేదీ నుంచి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారని, పార్టీ నాయకులందరికీ అన్ని నియోజకవర్గాల్లో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారన్నారు. ఈ ఆదేశాల మేరకు నవంబర్ 13వ తేదీ నుంచి రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. దీని ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, కష్టాలను తెలుసుకుంటున్నామన్నారు. టీడీపీ అధికారం చేపట్టి నాలుగేళ్లు అవుతోందని, ఈ కాలంలో ప్రజల కష్టాలు వర్ణనాతీతమన్నారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీ లు అమలు చేస్తామంటూ 600 హామీలను గుప్పించా రని, అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. పాలన పక్కనపెట్టి ఇసుక, మద్యం మాఫియా చేసేందుకే అధికార పార్టీ నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఇసుక రీచ్‌లకంటే అదనంగా రీచ్‌లను మంజూరు చేయించుకుని ఇసుక మాఫియాకు తెరతీశారని ఆరోపించారు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో వరి పంట తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు చాలా వరకూ నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కనీసం ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. నేరడి వద్ద వంశధార ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా ట్రిబ్యునల్ తీర్పు వచ్చినప్పటికీ ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వానికి ఏ అంశంపై కూడా చిత్తశుద్ధి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును తానే నిర్మాణం చేపడతానని బాబు చెప్పారని, పనులు కూడా ప్రారంభించారని, దీనిపై కేంద్రం లెక్కలు అడిగేసరికి ఇపుడు తప్పించుకునేందుకు యత్నిస్తున్నారన్నారు. ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీని నిర్వహించడం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ చట్టాలను పరిహసించడమేనన్నారు.
ప్రతిపక్షం లేకుండా చేసేందుకు చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలు పడుతున్న బాధలు, సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తూ అన్ని వర్గాలకూ తానున్నానంటూ భరోసాను ఇస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment