శ్రీకాకుళం అర్బన్: విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆర్థికపరంగా ముందుకు వెళ్లాలంటే ప్రత్యేకహోదాతోనే సాధ్యమని, ఇది తెలిసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మొదటినుంచి ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారన్నారు. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, పరిశ్రమలు వస్తాయన్నారు.
తద్వారా ఉపాధి అవకాశాలతో యువత, విద్యార్థుల భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందన్నారు. ఇదే లక్ష్యంతో ప్రతిపక్షనేతగా జగన్‌మోహన్‌రెడ్డి గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పోరాటాలు, దీక్షలు చేశారన్నారు. ప్రత్యేకహోదా ఆవశ్యకతను, హోదా లభిస్తే కలిగే ప్రయోజనాలను యువతకు వివరించేందుకు అన్ని జిల్లాల్లో ‘యువ భేరి’లు కూడా నిర్వహించారన్నారు. 2014 ఎన్నికల సమయంలో తిరుపతి వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి హోదా తెస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి ఐదుకోట్ల ప్రజలను నమ్మించి వారితో ఓట్లు వేయించుకున్నారన్నారు. అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలకు తిలోదకాలిచ్చారని దుయ్యబట్టారు.
చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు సమాధి కడుతూ హోదా కంటే ప్యాకేజీకే మొగ్గుచూపారన్నారు. 2014 ఎన్నికల సమయంలో బాబుకు ఓటెయ్యాలని, రాష్ట్రాభివృద్ధి బాబుతోనే సాధ్యమని అందుకు తనది హామీ అంటూ ప్రజలను నమ్మబలికిన పవన్‌కల్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబును ఈ నాలుగేళ్లలో ఒక్కసారైనా నిలదీశారా? అని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా కోసం జగన్ చేస్తున్న పోరాటానికి ఈ నాలుగేళ్లలో ఒక్కసారి కూడా మద్దతు ఇవ్వని చంద్రబాబును పవన్‌కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రజాస్వామ్య విరుద్ధంగా, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి టీడీపీలో చేర్పించుకున్నారన్నారు. దీనిపై పవన్‌కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు.
ఈ నాలుగేళ్లలో ఒక్కసారి కూడా కేంద్రంపై నోరుమెదపని చంద్రబాబు హఠాత్తుగా మాట మార్చి కేంద్రం ఏమీ చేయలేదని చెప్పడం ఎన్నికల డ్రామాగా అభివర్ణించారు. బాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో ప్రజలెవ్వరికీ న్యాయం జరగలేదని, కేవలం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూర్చారన్నారు. టీడీపీ ప్రలోభాలకు లొంగి ఆ పార్టీలో చేరినట్లు కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ ఇటీవల స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారని గుర్తు చేశారు. ఆయనలాగే జిల్లాలో కలమట వెంకటరమణతో సహా ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ కేవలం నజరానాలకు ఆశపడే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలంతా ఈ విషయాన్ని గ్రహించారని వారికి తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డికి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు మద్దతివ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment