సాక్షి, అచ్యుతాపురం: యలమంచిలి నియోజకవర్గంలో ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ పలుమార్లు అధికారం చేపట్టాయి. అయితే అభివృద్ధి జాడ మాత్రం కానరాలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. గత ఎన్నికల్లో అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఈసారి ఎన్నికల్లో మార్పు తథ్యమని ప్రజలు భావిస్తున్నారు.
అనుచరుల పాలన అవసరమా?
ఇప్పటివరకూ అనధికార జాబితాప్రకారం యలమంచిలి టీడీపీ అసెంబ్లీ టికెట్‌ను పంచకర్ల రమేష్‌బాబుకు ఇవ్వడానికి అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. పంచకర్ల రమేష్‌బాబు స్థానికేతరుడని ఆ పార్టీకి చెందిన గ్రామస్థాయి నాయకులే ముఖం చాటేస్తున్నారు ఐదేళ్లలో పంచకర్ల మండలానికి ఒక ఇన్‌చార్జిని నియమించి పాలన సాగించారు. రెవెన్యూ, పోలీసు కార్యాలయాలను వారి గుప్పెట్లో పెట్టుకుని కార్యకర్తలకు కనీసం విలువలేకుండా చేశారు. ఆ అనుభవాలను ఇప్పటికీ గ్రామస్థాయి నాయకులు మర్చిపోలేదు.
గ్రామంలో సమస్యలపై ఆ నాయకులు కార్యాలయాలకు వెళ్లే ఎమ్మెల్యే అనుచరులతో చెప్పించాలని స్వయంగా అధికారులే చెప్పడం నచ్చేదికాదు. దీంతో అనుచరుల పాలన మరలా అవసరమా అన్నట్టుగా ఆ పార్టీ గ్రామ నాయకులే పెదవి విరుస్తున్నారు. నియోజకవర్గంలో ఎప్పటినుంచో జెండా మోసి పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకులు ఉండగా మరోసారి స్థానికేతరుడికి సీటు కేటాయించడం దేశం పార్టీ స్థానిక నాయకులకు నచ్చడంలేదు.
హామీలన్నీ నీటి మూటలే...
నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. సెజ్‌లో నిర్వాసితులకు ఆర్ కార్డులు ఇచ్చి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అమలుకు నోచుకోలేదు. దుప్పుతూరు గ్రామాన్ని తరలిస్తామన్నారు. సెజ్ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేసి జీతాలు పెంచుతామని చెప్పారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి, పూడిమడక మత్స్యకారులకు జట్టీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. యలమంచిలి పట్టణంతో పాటు రాంబిల్లి మండలంలో 20 గ్రామాలకు తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. మునగపాకలో పల్లపు ప్రాం తాలకు ముంపు సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఇవేమీ పరిష్కరించలేదు.
ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు రోడ్ల విస్తరణ చేపడతామని, కొండకర్ల ఆవను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎలాంటి పనులు చేపట్టలేదు. అధికార పార్టీ నాయకలు ఐదేళ్లలో విస్మరించిన హామీలు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఆ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. మునగపాక, అచ్యుతాపురంలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయకుండా లాలం భాస్కరరావు గ్రామమైన లాలంకోడూరుకు కాలేజీ మంజూరు చేయడంపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. యలమంచిలి మున్సిపాలిటీలో పన్నుల భారాన్ని తగ్గించలేదు. ఫ్లెవోవర్ పనులు పూర్తికాలేదు. పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరించడంలో శ్రద్ధచూపలేదు. ఉపాధి హామీ పథకం అమలు చేయమని పట్టణ ప్రజలు ఏళ్ల తరబడి కోరినా పట్టించుకోలేదు. ఇవన్నీ ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి దారితీసే అంశాలు కానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రజలతో మమేకమైన వైఎస్సార్‌సీపీ...
వైఎస్సార్‌సీపీ ప్రచారంలో ముందంజలో ఉంది. జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ సాగింది. సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన యు.వి.రమణమూర్తిరాజు 130 రోజుల్లో 98 పంచాయతీలు, 27 మున్సిపల్ వార్డుల్లో ప్రతి ఇంటికీ తిరిగి నవరత్నాలను ప్రచారం చేశారు. మొదటి విడతలోనే ఎన్నిక జరగాల్సి రావడంతో సుమారు నెల రోజులకు మించి సమయంలేదు.
టీడీపీ చెందిన పంచకర్ల రమేష్‌బాబు పెందుర్తి లేదా, విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామనున్నారు. అయితే పెందుర్తిని సిట్టింగ్ ఎమ్మెల్యేకు కేటాయించగా, ఉత్తరాన్ని లోకేష్‌కి కేటాయించనున్నట్టు సమాచారం. దీంతో పంచకర్ల ఇక్కడే పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. తక్కువ సమయంలో ప్రత్యర్థి పార్టీ నాయకులు ఇంటింటికి తిరగడం సాధ్యపడదు. వైఎస్సార్‌సీపీ మాత్రం వివిధ కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారితో మమేకమైంది. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు పట్టం కట్టడం తథ్యం.
నవరత్నాలే వైఎస్సార్ సీపీకి అండ...
వైఎస్సార్‌సీపీకి నవరత్నాలే శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. నియోజకవర్గం వ్యవసాయ, పారిశ్రామికరంగం మిళితమై ఉటుంది. మత్స్యకారులు, వివిధ కులవృత్తిదారులు ఉన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించిన నవరత్నాలలో అన్ని పథకాలు ఈ నియోజకవర్గ ప్రజలకు సంపూర్ణంగా అందుతాయి. వైఎస్సార్‌సీపీ పాలనలో నియోజకవర్గం అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని ఓటర్లు వ్యక్తంచేస్తున్నారు. అధికారాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో ఈ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఏడు రోజులు పర్యటించారు. ప్రజలందరినీ కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. దారి పొడవునా నీరాజనం పలికారు. ప్రజల సమస్యలను గుర్తించారు. ఆయన అధికారంలోకి వస్తే పాదయాత్రలో గుర్తించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారన్న నమ్మకం ప్రజలకి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment