తెనాలిటౌన్: డెల్టా ప్రాంతంలో సాగయిన పసుపు పంట చేతికొచ్చింది. ప్రస్తుతం పసుపు దున్ని వండటం ప్రారంభించిన రైతులు దిగుబడుల తీరు చూసి కుదేలు అవుతున్నారు. తెనాలి వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలో తొమ్మిది వేల ఎకరాల్లో ఈ ఏడాది పసుపు సాగయింది.
తెనాలి మండలంలో 250 ఎకరాలు, కొల్లిపర మండలంలో 3000 ఎకరాలు, కొల్లూరులో 2500 ఎకరాలు, భట్టిప్రోలులో 1600 ఎకరాలు, దుగ్గిరాలలో 1250 ఎకరాలు, అమృతలూరులో 100 ఎకరాలు, వేమూరులో 100 ఎకరాలు, చుండూరులో 200 ఎకరాల్లో పసుపు పండిస్తున్నారు. అనుకూల పరిస్థితులు ఉంటే ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు రావాల్సిన దిగుబడులు ఈ ఏడాది 15 నుంచి 20 క్వింటాళ్లకు మించడం లేదు. ఎకరం కౌలు రూ.40 వేలు, విత్తనం పెట్టుబడులు, ఖర్చులు కలిపి మరో రూ.70 వేలు సాగుకు అవుతున్నట్లు రైతులు చెపుతున్నారు. పసుపు నాటడం, వండకానికి మరో రూ.10 వేలు అదనంగా ఖర్చు అవుతోంది.
రూ.7వేలు దాటని ధరలు..
ప్రస్తుతం దుగ్గిరాల మార్కెట్‌లో సరుకు క్వింటా కనిష్ట ధర రూ.5,700, గరిష్ట ధర రూ.7,000 వరకు ఉంది. కాాయ కనిష్ట ధర రూ.5,500, గరిష్ట ధర రూ.7,000 వరకు ఉంది. ఈ ఏడాది పెరిగిన సాగు ఖర్చుకు ఈ ధరలు ఆశాజనకంగా లేవని, ధరలు ఇలాగే కొన సాగితే నష్టాలు తప్పవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటా పసుపు రూ.10 వేలు పలికితేనే గిట్టుబాటు అవుతుందంటున్నారు.
క్వింటాకు రూ.10వేలు ధర ఉండాలి.
రెండు ఎకరాల పొలంలో పసుపు సాగు చేశాను. ఎకరానికి 15 క్వింటాళ్ల మించి దిగుబడులు వచ్చే పరిస్థితి లేదు. గత రెండేళ్లుగా మార్కెట్ లో క్వింటా రూ.5వేలకు మించి ధరలు లేవు. ఈ ఏడాది ధరలు కొంత మేరకు ఆశాజనకంగా ఉన్నప్పటికి దిగుబడులు తగ్గడంతో రైతుకు మిగిలేది ఏమీ లేదు. పసుపునకు ప్రభుత్వం క్వింటాకు రూ.9 వేల నుంచి రూ.10 వేలు మద్ధతు ధర ఏర్పాటు చేయాలి. ఈ ధరలు లేకపోతే వ్యవసాయం చేయడం దండగే. ఈ ఏడాది పసుపు సాగుకు ఖర్చులు పెరిగాయి. కూలీల కొరత ఏర్పడింది.
- బొద్దులూరి పూర్ణచంద్రరావు,
రైతు, గుడివాడ, తెనాలి మండలం
పసుపు రైతు కుదేలు
Published Sun, Mar 8 2015 2:45 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement