పరిహార భూములు ఎక్కడిస్తారు?
- మంత్రి నారాయణను నిలదీసిన ఎర్రబాలెం రైతులు
మంగళగిరి: ‘మా భూములకు బదులుగా ప్రభుత్వమిచ్చే భూములు ఎక్కడ కేటాయిస్తారు?. మా గ్రామ రైతులందరికీ ఒకే చోట కేటాయిస్తారా? లేక ఒక్కొక్కరికి వేర్వేరు చోట్ల ఇస్తారా?. ఈ విషయాల్ని అగ్రిమెంట్‌లో ఎందుకు చేర్చలేదు?. అగ్రిమెంట్ చేసుకుని.. కౌలు చెక్కు తీసుకున్న తర్వాత రైతుకు ఎలాంటి హక్కు లేదంటే మా పరిస్థితేంటి?.’ అని రైతులు రాష్ట్ర మంత్రి పి.నారాయణ వద్ద ప్రశ్నల వర్షం కురిపించారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం రైతులకు కౌలు చెక్కులు అందజేసిన మంత్రి.. భూముల్ని చదును చేసేందుకు పొలాల్లోకి చేరుకున్నారు. దీంతో అక్కడికి వచ్చిన రైతులు తమ ప్రశ్నలతో మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేశారు. వారి ప్రశ్నలకు నీళ్లు నమిలిన మంత్రి.. ‘మమ్మల్ని, చంద్రబాబును నమ్మండి. రైతులకు అన్యాయం చేయం’ అని అన్నారు. ‘రుణమాఫీ వ్యవహారంతో సీఎం చంద్రబాబుపై నమ్మకం పోయింది. ఇప్పుడెలా నమ్మాలి’ అని రైతులు ప్రశ్నించడంతో మంత్రి వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు.
నా భూమి దగ్గరకొస్తే ఆత్మహత్య చేసుకుంటా: రైతు రాఘవరావు
భూసమీకరణ గడువు చివరి రోజుల్లో.. మంత్రి నారాయణ నాటకాలాడి రైతులను భయపెట్టినందునే అంగీకారపత్రాలు ఇచ్చామని ఎర్రబాలెం రైతు రాఘవరావు వెల్లడించారు. ఇప్పుడు కౌలు చెక్కులు, భూముల చదును పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. చదును పేరుతో తనభూమి వద్దకు వస్తే మానవబాంబుగా మారి ఆత్మహత్య చేసుకుంటాని హెచ్చరించారు. భూముల గురించి నారాయణకు ఏం తెలుసని ప్రశ్నించారు. స్కూళ్లలో పేద పిల్లల వద్ద ఫీజులు గుంజడం నేర్చుకుని.. అదే విద్యను పేద రైతులపై చూపిస్తున్నారని విమర్శించారు. ఫీజులు వసూలు చేయడంలో నారాయణ దిట్ట కనుకే.. భూములు లాక్కొస్తారని చంద్రబాబు ఆయనను రాజధాని గ్రామాల్లో తిప్పుతున్నారని ఆరోపించారు.