రాజకీయ చాతుర్యం.. నిరాడంబర జీవితం | Yerrapareddy Adinarayana Reddy Lives In Simple Life In His Political Career | Sakshi
Sakshi News home page

రాజకీయ చాతుర్యం.. నిరాడంబర జీవితం

Published Fri, Mar 15 2019 8:28 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Yerrapareddy Adinarayana Reddy Lives In Simple Life In His Political Career - Sakshi

స్వాతంత్య్ర సమరయోధుడు ఎర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డి

సాక్షి, కడప : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఎర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డి జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. గొప్ప రాజకీయ చతురునిగా పేరు పొందిన ఆయన కొన్ని దశాబ్దాలపాటు జిల్లా రాజకీయాలను  శాసించారు. రాజకీయ విలువలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. నాటి ప్రధానమంత్రులు జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌బహదూర్‌శాస్త్రి, ఇందిరాగాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో సహా పలువురు రాష్ట్రపతులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి.

1916 అక్టోబరు 15వ తేది సుండుపల్లె మండలంలో ఆయన జన్మించారు. విద్యార్థి దశనుంచే జాతీయోద్యమ రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. అంచెలంచెలుగా  ఎదిగి అప్పట్లో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ హోదాలో 1940–41లో వ్యక్తిగత సత్యాగ్రహం నిర్వహించారు. అందుకు 500 రూపాయల జరిమాన, వేలూరు సెంట్రల్‌ జైలులో మూడు నెలల శిక్ష అనుభవించారు. అయినా ఆయన ఆశయం మొక్కవోలేదు.

జిల్లాలో క్విట్‌ ఇండియా ఉద్యమ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు. కొన్నాళ్లు రహస్య జీవితాన్ని గడిపారు. అప్పటి బ్రిటీషు ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. 1942 డిసెంబరు 11వ తేదీ నుంచి 1944 డిసెంబరు 7వ తేది వరకు వేలూరు, తంజావూరు జైళ్లలో శిక్ష అనుభవించారు. 1940 నుంచి 1949 వరకు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 1969 వరకు ఏఐసీసీ సభ్యునిగా ఉన్నారు. 1952లో గంజి కరువు సంభవించినప్పుడు ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూను రాయచోటికి ఆహ్వానించి కరువులో ప్రజలు పడుతున్న బాధలను ఆయనకు వివరించి సహాయ కార్యక్రమాలు అందేలా చూశారు.

1952–54, 1954–1962 వరకు రెండు పర్యాయాలు ఆయన రాయచోటి శాసనసభ్యునిగా పనిచేశారు. 1964–70లో రాజ్యసభ సభ్యునిగా సేవలు అందించారు. 1974 జూన్‌ 27వ తేది శాసనమండలి సభ్యునిగా ఎంపికయ్యారు. ఎన్ని ఉన్నత పదవుల్లో ఉన్నా... ఎందరు ప్రముఖులతో పరిచయాలున్నప్పటికీ వ్యక్తిగతంగా సామాన్య జీవితాన్నే గడిపిన ఆయన నేటి రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement