జిల్లా విద్యా సమాచార వ్యవస్థే యు డైస్
రాయవరం :పాఠశాలల్లో మౌలిక, భౌతిక అవసరాలను తీర్చేందుకు రూపొందించే ప్రణాళికలకు మూలాధారం ఆయా పాఠశాలల నుంచి సేకరించిన సమాచారం. ఆ సమాచార వ్యవస్థే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యు డైస్). దీని ఆధారంగా పాఠశాలలకు వసతుల కల్పనకు నిధులు మంజూరవుతుంటాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా మన జిల్లాలో మాత్రమే మండల స్థాయిలోనే యు డైస్ వివరాలను కంప్యూటరీకరణ చేస్తున్నారు.
సమాచార సేకరణ ఇలా...
2000 సంవత్సరం నుంచి యు డైస్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రతీ ఏటా సెప్టెంబర్ 30వ తేదీని ప్రాతిపదికగా తీసుకుని ఇందులో పాఠశాలల సమాచారాన్ని సేకరిస్తారు. ఈ సమాచార సేకరణకు విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్ కృషి చేస్తుంటాయి. గతేడాది యుడైస్ ద్వారా ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పాఠశాలల్లోని వివిధ అవసరాలకు రూ. 272 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మూడేళ్లుగా జూనియర్ కళాశాలల నుంచి కూడా యు డైస్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. పాఠశాలకు ఉపాధ్యాయ పోస్టులు మంజూరు, పోస్టుల రేషనలైజేషన్, నూతనంగా అదనపు తరగతి గదులు, తాగునీరు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ర్యాంపులు, వంటగదులు, లేబరేటరీ గదులు, ప్రత్యేక అవసరాల గల చిన్నారులకు ఉపకరణాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు..
ఇలా ఏది మంజూరు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం యు డైస్ ద్వారా పంపే సమాచారాన్నే ప్రాతిపదికగా తీసుకుంటుంది. ఈ సమాచారం ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం)కు నిధులు కేటాయిస్తుంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్‌రికగ్నైజ్డ్, మదర్సాలు, మైనార్టీ ఎడ్యుకేషన్ తదితర సంస్థలకు చెందిన 6,055 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి యు డైస్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తారు. మన జిల్లాలో ఖమ్మం జిల్లా నుంచి కొత్తగా కలిసిన నాలుగు మండలాలకు సంబంధించిన 374 పాఠశాలల నుంచి కూడా యు డైస్ సేకరిస్తారు. యు డైస్ ఫారం నింపే సమయంలో ఉపాధ్యాయుల ఆధార్ నంబరును ఈ ఏడాది తప్పనిసరి చేశారు.
యు డైస్ షెడ్యూల్ ఇదే..
యు డైస్‌పై అక్టోబర్ తొమ్మిదో తేదీ ఉదయం 10 గంటలకు అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులకు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. 16 నుంచి 19వ తేదీలోపు పూర్తిచేసిన యు డైస్ ఫారాలను కాంప్లెక్స్, మండల స్థాయిల్లో పరిశీలన చేస్తారు. ఆ తర్వాత ఆర్వీఎం కార్యాలయంలో నిర్దేశించిన సమయంలో పరిశీలన చేస్తారు. అనంతరం రాష్ట్ర స్థాయి ఆర్‌వీఎంకు, అక్కడ నుంచి కేంద్రప్రభుత్వానికి ఈ నివేదికను పంపిస్తారు.
ప్రణాళికా బద్ధంగా పూర్తి చేస్తాం
యు డైస్‌పై హెచ్‌ఎంలకు శిక్షణ ఇచ్చి సమర్ధవంతంగా యు డైస్ ఫారాలు పూర్తి చేసేలా చూస్తాం. యు డైస్ ద్వారా సేకరించిన సమాచారంతో బడ్జెట్‌ను రూపొందిస్తాం.
- వై. నాగేశ్వరరావు,
ఏఎంఓ, సర్వశిక్షా అభియాన్, కాకినాడ