
ట్రాఫిక్ తిప్పలు తప్పేనా?
కర్నూలు: విస్తరణలో దూసుకుపోతున్న కర్నూలు నగరంలో ట్రాఫిక్ పెరిగిపోతున్నా ఆ స్థారుులో క్రమబద్ధీకరణ చర్యలు లేకపోవడంతో నగరవాసులకు నిత్యకష్టాలు తప్పడంలేదు. పార్కింగ్ ప్రదేశాలు లేకపోవడం, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపివేస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గుతోంది. ఈ క్రమంలో ట్రాఫిక్ స్టేషన్ స్థాయిని పెంచుతూ ప్రభుత్వం ఇటీవల డీఎస్పీ స్థాయి అధికారిని నియమించింది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగర పరిధికి అనుగుణంగా ట్రాఫిక్ సుడిగుండం నుంచి గట్టెక్కిస్తారని నగరవాసులు నమ్ముతున్నారు.
ఒక్క స్టేషన్‌తోనే కుస్తీలు..
నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు నాలుగు స్టేషన్లుండగా ట్రాఫిక్ నియంత్రణకు మాత్రం ఒక్క స్టేషన్‌తోనే కుస్తీ పడుతున్నారు. అదనపు స్టేషన్‌కు 2003లో అప్పటి అధికారులు ప్రతిపాదించినా అమలుకు నోచుకోలేదు. జనాభా ప్రాతిపదికన మరో స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎస్పీ సీహెచ్.శ్రీకాంత్ హయాంలో హోం శాఖకు నివేదిక పంపారు. వన్‌టౌన్, టుటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి కలిపి ఒకటి, త్రీ, ఫోర్థ్ టౌన్ స్టేషన్ల పరిధి కలిపి అదనపు ట్రాఫిక్ స్టేషన్ కోసం ప్రతిపాదించినా ఫలితం లేదు.
1975లో కంట్రోల్ రూం సీఐ ఆధ్వర్యంలో కర్నూలు ట్రాఫిక్ స్టేషన్ ప్రారంభమైంది. 1983లో సర్కిల్‌గా ట్రాఫిక్ స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేసి సీఐని నియమించారు. నగర జనాభా 2 లక్షలుగా ఉన్నప్పుడు ప్రారంభమైన ట్రాఫిక్ స్టేషన్ ప్రస్తుతం ఐదు లక్షలు దాటినా అదే సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ప్రారంభంలో నగరంలో 3 వేల ఆటోలుండగా ప్రస్తుతం ఈ సంఖ్య 20 వేలకు, బయటి ప్రాంతాల నుంచి వస్తున్న బస్సుల సంఖ్య 1500 నుంచి ప్రస్తుతం 5వేలకు చేరింది. ఆ స్థారుులో రోడ్లను విస్తరించకపోవడం, నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం సమస్యకు కారణం.
అటకెక్కిన లింకు రోడ్ల ప్రతిపాదన
కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు జాతీయ రహదారులను కలుపుతూ లింకు రోడ్లు ప్రతిపాదించారు. చిన్న టేకూరు నుంచి నన్నూరు వరకు ఎన్‌హెచ్-7, 44ను కలుపుతూ ఒకటి, నన్నూరు నుంచి శివరాంపురం, గార్గేయపురం మీదుగా నందికొట్కూరు రోడ్డుకు లింకు చేస్తూ మరో రోడ్డు ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వానికి నివేదించారు.
నాగులాపురం వద్ద నుంచి పెద్దపాడు మీదుగా హైదరాబాద్‌కు అటు చిన్నకొట్టాల, బస్తిపాడు మీదుగా ఎన్‌హెచ్-44కు కలిపి బెంగళూరు వెళ్లే విధంగా రింగ్ రోడ్డు తరహాలో ఏర్పాటు చేయూలని ప్రతిపాదించారు. అలాగే కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు రోడ్ల కూడలి నుంచి రైల్వే స్టేషన్ మీదుగా అశోక్‌నగర్ పంప్ హౌస్‌వరకు ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఇవేమీ అమలుకునోచుకోలేదు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ ఈ ప్రతిపాదనలపై దృష్టి సారించాల్సి ఉంది.
రికవరీ వ్యాన్ మాటే ంటి ...?
రోడ్డుకు అడ్డంగా నిలుపుదల చేసిన వాహనాలను ట్రాఫిక్ స్టేషన్‌కు తరలించేందుకు రికవరీ వాహనం అవసరమని ప్రభుత్వానికి పంపిన నివేదిక కూడా అమలుకు నోచుకోలేదు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోకి భారీ వాహనాల ప్రవేశానికి నిషేధం ఉన్నప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదు. పాతబస్తీలో కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నందునా ఇతర ప్రాంతాల నుంచి సరుకుల లారీల వస్తూనే ఉన్నారుు.