
ఫేస్‌బుక్‌లో యువతిని ఎరగా వేసి..
► యువకుడిని హత్య చేసిన శత్రువులు
► పాత కక్షల నేపథ్యంలో హత్య!
► రెండు కోణాల్లో విచారిస్తున్న పోలీసులు
కంకిపాడు (పెనమలూరు): ఫేస్‌బుక్ పరిచయం ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామ పరిధిలో ఓ కార్పొరేట్ కళాశాల సముదాయం వద్ద షేక్ రఫీ అనే యువకుడు దారుణహత్యకు గురైన ఘటన గురువారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన షేక్ రఫీ (26)కి కొద్ది రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. బుధవారం యువతి నుంచి ఫోన్ రావడంతో రఫీ తన స్నేహితుడు షేక్ అబ్దుల్ జబ్బా అలియాస్ మున్నాతో కలిసి రాత్రి 8 గంటల సమయంలో బైక్‌పై పునాదిపాడు వచ్చాడు. తనకు ఫోన్ చేసిన యువతి గురించి ఆరా తీస్తున్న సమయంలో ఆటోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు రఫీ, మున్నాపై కత్తులతో దాడి చేశారు. మున్నా స్వల్ప గాయాలతో దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. రక్షించుకునేందుకు పరుగు తీసిన రఫీ ఆచూకీ బుధవారం అర్ధరాత్రి వరకూ తెలియలేదు. రఫీ స్నేహితులు, కుటుంబ సభ్యులు గురువారం పునాదిపాడు వచ్చి గాలించగా, దాడి జరిగిన ప్రదేశానికి 100 మీటర్ల దూరంలోనే రఫీ మృతదేహం లభించింది. కత్తులతో దాడి చేయడంతో రఫీ ఎడమచేయి, తల ఛిద్రమయ్యాయి.
హత్య వెనుక అనుమానాలెన్నో
అయితే రఫీ హత్యలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మంగళగిరిలో గత నెల 2న కనకారావు హత్య జరిగింది. ఇందులో రఫీ పాత్ర ఉందని కనకారావు కుటుంబ సభ్యులకు అనుమానం ఉంది. ఈ నేపథ్యంలో రఫీని చంపడానికి ఫేస్‌బుక్ ద్వారా యువతిని ఎరగా వేసి సంఘటన స్థలానికి రప్పించి హత్య చేశారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. పోలీసులు దీంతోపాటు రఫీ కదలికలను మొదటి నుంచి శత్రువులు గమనించి హత్య చేశారనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని డీసీపీ రాణా, ఈస్ట్ జోన్ ఏసీపీ విజయ్‌భాస్కర్ పరిశీలించారు.