కొత్తవలస: ఆటో-మోటార్‌సైకిల్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక అగ్నిమాపకశాఖ కార్యాలయ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి కొత్తవలస ఎస్‌ఐ ఎస్.ధనుంజయరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. జామి మండలం అలమండ గ్రామానికి చెందిన లగుడు రవికుమార్ (30) ఓ శుభకార్యానికి సంబంధించిన కార్డులను పంచుతూ ఎస్.కోట నుంచి మోటార్‌సైకిల్‌పై కొత్తవలస వస్తుండగా కొత్తవలస నుంచి ఎస్.కోటవైపు వెళుతున్న గూడ్స్ ఆటోను ఢీకొన్నాడు.
రోడ్డుపై పడటంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడు అలమండలోని బాపు విద్యానికేతన్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు బార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే అలమండ గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. ఉదయం గ్రామంలో అందరితో సరదాగా గడిపిన రవికుమార్ అంతలోనే రోడ్డుప్రమాదంలో మృత్యువాత పడ టాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. మృతుని సోదరుడు వెంకటప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆటోడ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలం వద్ద పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబం
అలమండ (జామి): రోడ్డు ప్రమాదంలో లగుడు రవికుమార్ మరణించటంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మృతుడికి భార్య వరలక్ష్మి, కుమారుడు ముత్యాలనాయుడు(4) కుమార్తె సిమిత (2) ఉన్నారు. అన్నయ్య కుమార్తె రజస్వల శుభకార్య ఆహ్వాన కార్డులను పంచి సాయంత్రానికల్లా ఇంటికి వస్తానని చెప్పి వెళ్లిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు తెలియగానే వరలక్ష్మి బోరున రోదిస్తూ కుప్పకూలిపోయారు. తండ్రి మరణించాడన్న విషయం తెలియని పిల్లలిద్దరు బిత్తర చూపులు చూడటం అందరినీ కలచివేసింది. ఈ ఘటనతో అలమండ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
Published Wed, May 13 2015 1:08 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement