కమలాపురం మండలం టి.చదిపిరాళ్లకు చెందిన పాలగిరి సరస్వతమ్మ, నారాయణరెడ్డి దంపతుల కుమారుడు పి.హరినారాయణరెడ్డి(25) బుధవారం అకాల మృత్యువాతపడ్డాడు. చార్జింగ్ పెట్టిన సెల్‌ఫోన్‌ను తొలగిస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు వెంనటే అతన్ని కమలాపురంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మరణించినట్లు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం హోరెత్తిపోయింది.
జరిగిందెలాగంటే...
విద్యుత్ డ్రమ్ములకు ఎర్త్ లేకపోవడంతో గ్రామంలోని ఇళ్లకు కరెంట్ సరఫరా అవుతోంది. ఈ విషయాన్ని గ్రామస్తులు పలుమార్లు ట్రాన్స్‌కో అధికారుల దృష్టి కి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు. తమ చిన్నాన్న ఇంటికీ కరెంట్ ప్రవహించి టీవీతో పాటు మరికొన్ని వస్తువులు కాలిబూడిదయ్యాయి. దీంతో ఆ ఇంటికి సంబంధించిన విద్యుత్ సర్వీసు వైర్లను తొలగించిన హరినారాయణరెడ్డి ఆ తరువాత ఇంటికెళ్లి చార్జర్ నుంచి సెల్‌ను తీస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆ తరువాత ప్రాణాలొదిలాడు.
అమ్మానాన్నల కోరిక నెరవేర కనే...
చదిపిరాళ్లకు చెందిన సర్వసతమ్మ, నారాయణరెడ్డి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె సంతానం. ఉన్నదాంట్లోనే బిడ్డలను బాగా చదివించి ప్రయోజకులు చెయ్యాలని వారు ఆశించారు. పిల్లలు కూడా బాగా చదివి చదువులో రాణిస్తున్నారు. ఇంటికి పెద్ద కుమారుడైన హరినారాయణరెడ్డి పట్టుదలతో బీటెక్ పూర్తి చేశాడు. ఆ తరువాత బ్యాంక్ ఉద్యోగాల కోసం కోచింగ్‌కు వెళ్తున్నాడు. అయితే తన లక్ష్యం నెరవేరకుండానే ఆయన అకాల మృత్యువాతపడటం కలచివేసింది. చేతికి ఎదిగొచ్చిన కొడుకు ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదించారు. కొడుకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మృతదేహంపై పడి ఆ తల్లి ఏడ్వడం అక్కడున్న వారి హృదయాలను పిండేసింది.
ట్రాన్స్‌కో నిర్లక్ష్యానికి బలి
Published Thu, Jan 9 2014 5:00 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM
Advertisement