డ్రగ్స్‌: వీరే టార్గెట్‌.. జాగ్రత్త తప్పనిసరి | Youth Addicted To Drugs Parents Should Need Observation on Children | Sakshi
Sakshi News home page

దమ్‌.. మారో.. దమ్‌

Published Mon, Feb 17 2020 9:22 AM | Last Updated on Mon, Feb 17 2020 9:38 AM

Youth Addicted To Drugs Parents Should Need Observation on Children - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

గుంటూరు నగరానికి చెందిన రోహిత్‌ (పేరు మార్చాం) పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో బాగా చదివేవాడు. స్కూల్, కాలేజీ టాపర్‌. ఇంటర్‌ పూర్తవ్వగానే ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ (బీటెక్‌)లో చేరాడు. మొదటి సంవత్సరం సెకండ్‌ క్టాస్‌లో పాసయ్యాడు. రెండో సంవత్సరం నుంచి బ్యాక్‌ లాగ్స్‌ మొదలయ్యాయి. ఉదయం కళశాలకు అని చెప్పి వెళ్లిన వాడు అర్ధరాత్రి దాటిన తర్వాత ఎప్పుడో ఇంటికి వచ్చేవాడు. చదువుపై కూడా శ్రద్ధ తగ్గింది. కుటుంబ సభ్యులతో సరిగా మాట్లాడటం మానేశాడు. వారితో కలవకుండా ఒంటరిగా ఉంటున్నాడు. ఒక రోజు గుంటూరు అర్బన్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌ నుంచి రోహిత్‌ తండ్రికి ఫోన్‌ వచ్చింది. మీ అబ్బాయి గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డాడని పోలీసులు చెప్పారు. దీంతో రోహిత్‌ తల్లిదండ్రులు షాకయ్యారు. ఇది కేవలం ఒక్క రోహిత్‌ తల్లిదండ్రుల విషయంలోనే కాదు. మత్తు పదార్థాలకు బానిసలైన అనేక మంది విద్యార్థుల కుటుంబాలకు ఎదురైన ఘటన. 

సాక్షి, గుంటూరు: చదువు కోవాల్సిన వయసు పక్కదారి పడుతోంది. పుస్తకాల ఉండాల్సిన బ్యాగుల్లో మత్తు పదార్థాలు కనిపిస్తున్నాయి. జల్సాలకు అలవాటు పడి ఉజ్వల భవిష్యత్తు చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. గుంటూరు నగరంలో కొందరు కాలేజీ యువకులు గంజాయితో పాటు మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారు. ఆ మత్తులో మునగడమే కాకుండా వాటి విక్రయాల్లోనూ కూరుకుపోతున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొస్తున్న మత్తు పదార్థాల మాఫియా వాటిని విక్రయించి సొమ్ము చేసుకునేందుకు యువతను పావులుగా వాడుతోంది.

మాయమాటలు నమ్మి.. 
జిల్లాలో ఇంజనీరింగ్, డిగ్రీ, ఇతర విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల్లో కొందరు గంజాయి మత్తులో జోగుతున్నారు. అప్పటి వరకూ పాఠశాలలు, కాలేజీల్లో చదివి ఉన్నత విద్యాల కోసం యూనివర్సిటీలు, ఇతర కళాశాలల్లో చేరడం, అదో కొత్త కలల ప్రపంచంలా కనిపించే సరికి చెడు వ్యసనాలకు అలవాటుపడుతున్నారు. తెలిసీ తెలియని వయసులో కొందు కేటుగాళ్ల మాటలు నమ్మి తరగతులకు డుమ్మా కొట్టి సినిమాలు, షికార్లు అంటూ తిరుగుతూ మత్తు పదార్థాలు తీసుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.  

వాళ్ల టార్గెట్‌ వీళ్లే..  
సంపన్న, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలను టార్గెట్‌ చేస్తూ గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుంటూరు, చిలకలూరిపేట, మంగళగిరి, తాడేపల్లి, నరసరావుపేట సహా పలు ప్రాంతాల్లోని ప్రైవేట్‌ కళాశాలలు, యూనివర్సిటీల వద్ద మకాం వేస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల ముటా సభ్యులు మాటలు కలిపి విద్యార్థులతో స్నేహం చేస్తున్నారు. వారితో పరిచయాలు పెంచుకుని బర్త్‌డే, వీకెండ్‌ అంటూ నమ్మ బలికి పార్టీలకు ఆహ్వానిస్తున్నారు. పార్టీలకు వచ్చిన విద్యార్థులను ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు ఎంజాయ్‌ చేస్తావ్‌ అంటూ మాయమాటలు చెప్పి మద్యం, గంజాయి, మత్తు పదార్థాలు తీసుకునేలా ఉసుగొలుపుతున్నారు. అనంతరం వారిని గంజాయి రవాణా, ఇతరత్రా కార్యకలాపాల్లో పావులుగా వాడుకుంటున్నారు. జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం, సరఫరా చేస్తున్న వారిలో 50 శాతానికిపైగా ఇంజనీరింగ్‌ విద్యార్థులే ఉన్నట్టు పోలీస్, ఎక్సైజ్‌ అధికారుల పరిశీలనలో వెల్లడైంది.  

విచ్చలవిడిగా లభ్యం.. 
గత కొద్ది రోజుల కిందట నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న విదేశీ ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులతో సంబంధాలున్న గుంటూరు నగరానికి చెందిన ఓ హోటల్‌ యజమాని కుమారుడు, ఫిరంగిపురం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విదేశీ ముఠా సభ్యులను మత్తు పదార్థాలు జిల్లాకు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు. ఇక్కడ ఎవరెవరికీ విక్రయిస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీయగా అధిక శాతం మంది బీటెక్, డిగ్రీ, ఇతర విద్యార్థులే వినియోగం, విక్రయం సాగిస్తున్నట్టు తేలింది. ఇదే తరహాలో అనేక ఘటనల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, వినియోగిస్తూ, సరఫరాచేస్తూ కాలేజీ విద్యా ర్థులు పట్టుబడ్డారు. గడిచిన రెండు నెలల్లో ఈ తర హా 18కేసులు నమోదయ్యాయి. విచ్చలవిడిగా రూ.100–200లకే గంజాయి సిగరెట్‌లు, ఇతర మ త్తు పదార్థాలు లభిస్తుండటంతో విద్యార్థులు వా టికి బానిసలుగా మారి పెడదోవపడుతున్నారు.  

తల్లిదండ్రులు గుర్తించాలి 
► కాలేజీలకు వెళ్లిన పిల్లలు ఏ సమయానికి తిరిగి ఇంటికి వస్తున్నారు. పార్టీలు, పర్యటనలని తరచూ ఎక్కడికైనా వెళ్తున్నారా? అని గమనించాలి. 
► బ్యాక్‌లాగ్స్‌ నమోదవుతున్నాయంటే అందుకు గల కారణాలను లోతుగా విశ్లేషించాలి. 
► చదువుల్లో వెనుకబడుతున్నప్పుడు కళాశాలలోని లెక్చరర్లతో మాట్లాడాలి. 
► ఎవరెవరితో తిరుగుతున్నారో ఓ కంట కనిపెట్టాలి. అవసరం ఉన్న మేరకే డబ్బు ఇవ్వాలి. ఇచ్చిన డబ్బు ఎందుకోసం ఖర్చుపెట్టారో ప్రశ్నించాలి. 
► ముఖ్యంగా పిల్లలతో సన్నిహితంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వారి బాధలను, ఇబ్బందులను తెలుసుకుంటూ సలహాలు ఇస్తూ ప్రోత్సహించాలి. 

భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు 
యువత చెడు వ్యసనాల బాట పట్టొద్దు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయేతలు వాళ్ల అవసరాలాకు వాడుకోవడం కోసం మీతో సన్నిహితంగా మెలుగుతారు. యవత దీన్ని గుర్తుంచుకోవాలి. మత్తుకు బానిసలుగా మారితే భవిష్యత్తు నాశనం అవుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలపై నిరంతర నిఘా ఉంచాలి.   
–పీహెచ్‌డీ రామకృష్ణ, గుంటూరు అర్బన్‌ ఎస్పీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement