పల్లెలకూ పాకిన ఆన్‌లైన్ జూదం
తీవ్రంగా నష్టపోతున్న యువతరం
బుకీల మూలాలను గుర్తించలేకపోతున్న పోలీసులు
సాక్షి, గుంటూరు: క్రికెట్ బెట్టింగ్ జిల్లాలోని యువకులను ఆర్థికంగా దెబ్బతీస్తొంది. ఆట గురించి కనీస పరిజ్ఞానం లేని యువతరం కూడా ఈ వ్యసనానికి బానిసై కుదేలవుతోంది. ఎక్కడో ముంబై, కోల్‌కతా, ఢిల్లీ వంటి మహానగరాల్లో ఉండే బుకీలు ఆన్‌లైన్ ద్వారా అన్ని రాష్ట్రాల్లో ఏజెంట్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యసనం గ్రామీణ ప్రాంతాలకు సైతం పాకడంతో, దీనికి బానిసలైన యువత భవిత ప్రశ్నార్థకంగా మారుతోంది. బెట్టింగ్ ఏజెంట్లు, పందాలు కాసే యువతలో క్రికెట్ అంటే తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
* బెట్టింగ్‌లు కాసేవారిలో బడా వ్యాపారుల కుమారులే కాకుండా కంపెనీలు, షాపుల్లో గుమస్తాలుగా పనిచేస్తున్న యువకులు, విద్యార్థులు సైతం పాల్గొంటూ ఆర్థికంగా దెబ్బతింటున్నారు.
* విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాలతో పాటు గుంటూరు జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, కారంపూడి, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో బెట్టింగ్ జోరుగా సాగుతోంది.
* ఈ వ్యసనం బారినపడి ఎంతో మంది యువకులు తీవ్రంగా నష్టపోతున్నారు.
బెట్టింగ్ కొనసాగేదిలా....
* పట్టణ, మండల కేంద్రాల్లో బెట్టింగ్‌లు నిర్వహించే బుకీల ఏజెంట్లు ఆ ప్రాంతంలోని పోలీసు అధికారులకు నెలవారీ మామూళ్లు చెల్లిస్తూ రక్షణ కల్పించుకుంటారు.
* మ్యాచ్ సమయంలో ఓ గదిలో ల్యాప్‌టాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఢిల్లీ, కోల్‌కతా వంటి మహానగరాల్లో ఉండే బుకీలను సంప్రదిస్తారు. మ్యాచ్ అయిపోయేంత వరకు రన్నింగ్ కామెంటరీలాగా ప్రతిక్షణం బెట్టింగ్ రేట్లు ఎలా ఉన్నాయో ఓ సెల్‌ఫోన్ ద్వారా కనుక్కుంటారు. పక్కన మరో పది సెల్‌ఫోన్ల వరకు పక్కన పెట్టుకొని బెట్టింగ్‌లు నిర్వహించే వారితో మాట్లాడుతూ బెట్టింగ్ రేట్లు ఎలా ఉన్నాయో తెలియజేస్తూ పందాలను ఎప్పటి కప్పుడు వారి పేరుపై నమోదు చేస్తూ ఉంటారు.
* మ్యాచ్ అయిన మరుసటి రోజే డబ్బు తమకు రావాల్సిన వారి వద్దకు మనిషిని పంపుతారు. తాము ఇవ్వాల్సిన వారికి కూడా డబ్బు కచ్చితంగా ఇస్తూ నమ్మకంగా వ్యాపారంగా చేస్తుంటారు.
* ఎవరైనా డబ్బు చెల్లించలేకపోతే బెదిరింపులకు దిగుతుంటారు. బుకీలు ఏజెంట్లకు డబ్బు ఇవ్వాలన్నా.. తమకు రావాలన్నా ఆయా ప్రాంతాల్లోనే హవాలా ద్వారా ఎక్కడికక్కడే సమకూరుస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
* ఆన్‌లైన్ ద్వారా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని బెట్టింగ్ దందాను నడుపుతున్న బుకీల మూలాలను కనుగొనలేని పోలీసులు, బ్రోకర్ ఆఫీసులు, టీస్టాల్స్, రెస్టారెంట్లలో చిన్న చిన్న బెట్టింగ్‌లు నిర్వహించే యువకులపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
వ్యసనంగా మారిన క్రికెట్ బెట్టింగ్
Published Tue, Sep 9 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM
Advertisement
Advertisement