వైఎస్‌ఆర్ జిల్లా, పులివెందుల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నది ధర్మ పోరాటం కాదని.. అధర్మ పోరాటమని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. బుధవారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నిర్వహించిన ధర్మపోరాట దీక్ష కేవలం ప్రతిపక్ష నాయకుడిని విమర్శించడానికే ఏర్పా టు చేసినట్లు ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగి వారం రోజులు కూడా దాటకముందే ఆయన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాలన్న చెత్త సంస్కారం చంద్రబాబు నాయుడికే సొంతమన్నారు. రాష్ట్రానికి నాలు గున్నరేళ్లుగా అన్యాయం చేశారన్నారు. ప్రజలను మోసం చేసి, గ్రామాల నుంచి అమరావతి దాకా ప్రతి ఒక్క అంగుళాన్ని దోచుకుని చంద్రబాబు అధికారంలో కొనసాగుతున్నాడన్నారు. ఆయన 40ఏళ్ల రాజ కీయ జీవితంలో ధర్మం, న్యాయం, చట్టం, నీతి ఈ నాలుగింటిని తొక్కేసి, అధర్మం, అన్యాయం, చట్ట విరుద్ధ కార్యకలాపాలు కొనసాగించి అవినీతికి ఐకాన్‌గా మారాడన్నారు. కడప జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల్లో మొత్తం పంటలన్ని ఎండిపోతే కరువు గురించి, రైతు గురించి ఒక్క మాట కూడా చంద్రబాబు మాట్లాడకపోవడం విచారకరమన్నారు.
ఇప్పుడు ధర్మపోరాట దీక్ష అంటున్న చంద్రబాబు నాలుగేళ్లపాటు బీజేపీతో కలిసి ఎందుకు సంసారం చేశాడన్నారు. వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ అంటూ ఏడాదికి రూ.50కోట్లు ముష్టి వేస్తామన్న రోజున చంద్రబాబు ఏమి చేస్తున్నాడని ప్రశ్నించారు. ఆ రోజే రూ.50కోట్లు కాదు... జిల్లాకు రూ.500 కోట్లు ఇవ్వాలని గట్టిగా అడిగి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు వైదొలగలేదన్నారు. చంద్రబాబు చేస్తున్నది ధర్మ పోరాటమైతే.. అదే వేదికపై అధర్మంగా పార్టీ మారిన ఎమ్మెల్యే, ఎంపీలను నెత్తిన పెట్టుకున్నాడన్నారు. రాష్ట్రానికి సమస్య ప్రతిపక్ష నాయకుడు అని చెబుతున్న చంద్రబాబు ఆయనే పెద్ద సమస్యగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రానికి సమస్య చంద్రబాబుతో వచ్చిన కరువు, రాష్ట్రానికి సమస్య చంద్రబాబు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు, రాష్ట్రానికి సమస్య చంద్రబాబు ప్రజల నెత్తిన పెట్టిన అప్పులు, రాష్ట్రానికి సమస్య చంద్రబాబు చేయిస్తున్న అవినీతి కానీ ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతారని ప్రశ్నించారు.
రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను గాలికి వదిలేసి వైఎస్ జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చంద్రబాబుకు పెద్ద సమస్యలా మారిందన్నారు. నాలుగేళ్లుగా బీజేపీతో కలిసి ఉన్నప్పడు చంద్రబాబు కానీ, ఆయన తనయుడు లోకేష్ కానీ, చంద్రబాబు బినామీ సీఎం రమేష్‌లకు కడప ఉక్కు పరిశ్రమ కనిపించలేదా అన్నారు. 1995నుంచి 2004 వరకు రాయలసీమ ప్రాజెక్టులకు చంద్రబాబు ఎంత నిధులు వెచ్చించారో.. ఏం పూర్తి చేశాడో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. అటు రాజధానిలోని పొలాలను, తునిలో రైలును తగులబెట్టించి ఆ నెపాన్ని కడప జిల్లా ప్రజలపై మోపి ఇప్పుడు అదే జిల్లాలో అడుగుపెట్టే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ధర్మ పోరాటంలో ఆదినారాయణరెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి, సోమిరెడ్డి వంటి నాయకులతో ప్రతిపక్ష నాయకుడిని దుర్భాషలాడించి చంద్రబాబు శునకానందం పొందాడని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment