బాబుకు త్వరలో గుణపాఠం | Ravali Jagan Kavali Jagan Program YSR Kadapa | Sakshi
Sakshi News home page

బాబుకు త్వరలో గుణపాఠం

Published Sat, Sep 29 2018 9:49 AM | Last Updated on Sat, Sep 29 2018 9:49 AM

Ravali Jagan Kavali Jagan Program YSR Kadapa - Sakshi

మాట్లాడుతున్న కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

సాక్షి కడప :  ఎన్నికల ముందు ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి గద్దెనెక్కవచ్చునని చంద్రబాబు కలలు కంటున్నారని..రాష్ట్ర ప్రజలు అన్ని విధాలా ఆలోచన చేస్తున్నారని రానున్న 2019 ఎన్నికలలో చంద్రబాబుకు గుణపాఠం తప్పదని వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ నేతలు తేల్చి చెప్పారు.శుక్రవారం పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం గొందిపల్లెలో కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, రాయచోటి నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లె మండలం ఎర్రగుడి పంచాయతీలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రొద్దుటూరులోని 30వ వార్డులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలో ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసి.. ఏదొ ఒక సాకుతో ప్రత్యేక విమానాల్లో తిరగడం తప్ప చేసిందేమిలేదని వారు దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని  డిమాండ్‌ చేశారు.  ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించడం.. అధికారంలోకి రాగానే   ప్రజలను బాబు మోసం చేస్తున్నారని   ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలను చూసి చలించిపోయి ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని  తెలియజేశారు. ఆయనకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని.. వైఎస్‌ జగన్‌కు వస్తున్న  ఆదరణ చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తోందని వారు స్పష్టం చేశారు. 2019లో అధికారంలోకి రావడం తథ్యమని.. వైఎస్‌ జగన్‌తోనే రాజన్న రాజ్యం సాధ్యమని  తేల్చి చెప్పారు.

నాయకులకు ఘనస్వాగతం
జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలోని గొందిపల్లె, రంగోరిపల్లె గ్రామాల్లో కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పర్యటించారు. మహిళలు ఆయనకు హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు. గొందిపల్లె ఎస్సీ కాలనీలో పలు కుటుంబాలు వైఎస్సార్‌సీపీలోకి చేరగా.. అందరిని కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి కండువా వేసి ఆహ్వానించారు.   ప్రజల కష్టాలు తెలుసుకుంటూ.. టీడీపీ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలకు తలొగ్గక ధైర్యంగా ముందుకెళ్లాలని ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. ప్రొద్దుటూరు పరిధిలోని 30వ వార్డులో నేతాజీ నగర్, పుత్తా వీధులలో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఇంటింటికి తిరిగారు. ప్రతి ఇంటి వద్ద నవరత్నాల కరపత్రాన్ని అందించి.. దాని ద్వారా ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. ప్రతి ఒక్కరు వైఎస్‌ జగన్‌ను ఆదరించాలని.. ఒక్క అవకాశం కల్పించాలని ఆయన ప్రజలను కోరారు.

రాయచోటి నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లె మండలంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి రావాలి జగన్‌ – కావాలి జగన్‌ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఎర్రగుడి పంచాయతీలోని కోనంపేటతోపాటు అనేక పల్లెల్లో కలియ తిరిగారు. ప్రతి ఇంటికి వెళుతూ చంద్రబాబు చేస్తున్న మోసాలను గమనించాలని ఆయన సూచించారు. రానున్న కాలంలో మంచి రోజులు వస్తాయని.. ఒక్కసారి వైఎస్‌ జగన్‌కు అధికారం ఇస్తే సువర్ణ పాలన అందిస్తారని ఆయన తెలియజేశారు. గడికోట శ్రీకాంత్‌రెడ్డికి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement