వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు.
నివాళులర్పించిన వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు
వేంపల్లె: వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ కుమార్తె షర్మిల, బ్రదర్ అనిల్‌కుమార్, కోడలు వైఎస్ భారతిరెడ్డి, మనుమడు రాజారెడ్డి, మనుమరాళ్లు హర్ష, వర్ష, అంజలి, ఇతర కుటుంబ సభ్యులు వైఎస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఉదయం 8 గంటల సమయంలో వైఎస్ ఘాట్‌కు చేరుకున్న వైఎస్ జగన్ చాలాసేపు సమాధివైపు తదేకంగా చూస్తూండిపోయారు. వైఎస్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నివాళులర్పించి.. గంట పాటు అక్కడ గడిపారు. వైఎస్ ఆశయ సాధనకు అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా వైఎస్ కుటుంబ సభ్యులు చెప్పారు. పాస్టర్లు నరేష్ బాబు, మృత్యుంజయరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.పురుషోత్తమరెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి వైఎస్ సౌభాగమ్మ, వైఎస్ సోదరుడు వైఎస్ సుధీకర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు వైఎస్ ప్రకాష్‌రెడ్డి, కమలమ్మ, విమలమ్మ, పులివెందుల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ సోదరి రాజమ్మ, మరియమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, శ్రీకాంత్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు పాల్గొన్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని జిల్లాల్లోనూ వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నివాళులర్పించారు. రక్తదానం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
వైఎస్ ఇచ్చిన కుటుంబమే నాకు స్ఫూర్తి: జగన్
సాక్షి, హైదరాబాద్ : ‘‘ప్రతి అడుగులోనూ నాన్న లేని లోటును చవిచూస్తున్నాను. అయి తే నాన్న నాకొక పెద్ద కుటుంబాన్ని ఇచ్చివెళ్లారు. ఆ కుటుంబమే కష్టకాలంలోనూ తోడుగా ఉంటూ నాకు దన్నుగా నిలిచింది, నిలుస్తోంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున స్మరించుకున్నారు. వైఎస్సార్ 66 వ జయంతిని పురస్కరించుకుని జగన్‌మోహన్‌రెడ్డి తనలోని భావాలను ట్వీటర్‌లో ఈ విధంగా స్పందించారు. ‘‘ఆయన (వైఎస్) గొప్పతనాన్ని నాకు గుర్తుచేస్తూ, ఆయన బాటలో నడిచేలా నాకు స్ఫూర్తినిస్తున్నారు. తద్వారా మీ నుంచి నేను రోజూ ధైర్యాన్నీ మద్దతునూ పొందుతున్నాను’’ అని అభిమానులందరినీ స్మరించుకున్నారు.