సాక్షి, సాలూరు: తనపై జరిగిన హత్యాయత్నం అనంతరం ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోలుకొని ప్రజలతో మమేకమయ్యేందుకు సిద్దమయ్యారు. 17 రోజుల విరామం అనంతరం సోమవారం జననేత పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. అందులో భాగంగా ఆయన ఆదివారం రాత్రి విజయనగరం జిల్లాలోని పాదయాత్ర శిబిరానికి చేరుకోనున్నారు. రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ జననేత కొనసాగిస్తున్న ప్రజాసంకల్పయాత్ర 295వ రోజు పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. రేపు ఉదయం సాలూరు నియోజకర్గంలోని మేలపువలస నుంచి జననేత పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మక్కువ క్రాస్, ములక్కాయవలస మీదుగా కాశీపట్నం క్రాస్ వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు.
తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పాపయ్యవలస మీదుగా కొయ్యనపేట వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్టణం విమానాశ్రయంలో గత నెల 25వ తేదీన వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత.. ఆయనకు చికిత్స అందించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇవ్వడంతో పాదయాత్రకు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే.
11 జిల్లాలో పాదయాత్ర పూర్తి..
వైఎస్ జగన్ ఇప్పటి వరకు వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్టణం జిల్లాల్లో ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేశారు. అనంతరం విజయనగరం జిల్లా శృంగవరపుకోట, విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసి సాలూరు నియోజకవర్గంలో ఉన్నారు. ఈ జిల్లాలో ఇంకా పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలు మిగిలి ఉన్నాయి. ఇవి పూర్తయ్యాక చివరి జిల్లాగా శ్రీకాకుళంలో ప్రవేశిస్తారు. ఏడాదిగా మొత్తం మీద జగన్ 3,211.5 కిలోమీటర్ల దూరం నడిచారు.
Comments
Please login to add a commentAdd a comment