అందరినీ వంచించిన బాబుకు బుద్ధి చెప్పండి
♦ నంద్యాల ప్రజలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
♦ నంద్యాల ఓటు అందుకు నాంది కావాలి
♦ న్యాయం వైపే ప్రజలు నిలబడి శిల్పామోహన్‌రెడ్డిని గెలిపించండి
నంద్యాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : వాగ్దానాలన్నీ విస్మరించి ప్రజలందరినీ మోసగించిన చంద్రబాబు దుర్మార్గ పాలనను అంతమొందించాలని, నంద్యాల ప్రజలు ఉప ఎన్నికలో బాబు అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసి అందుకు నాంది పలకాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రైతులు, పొదుపు సంఘాల అక్క, చెల్లెమ్మలు, విద్యార్థులు, నిరుద్యోగులు, పేదలు.. ఇలా అన్ని వర్గాల వారినీ మోసపూరిత వాగ్దానాలతో వంచించిన చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పేందుకు ఇదే సరైన తరుణమన్నారు. ‘ఎన్నికల ముందు ఇచ్చిన ఏ వాగ్దానాన్నీ చంద్రబాబు అమలు చేయలేదు. ముఖ్యమంత్రి హోదాలో వచ్చి కర్నూలు జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు.
ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక వచ్చేసరికి మళ్లీ పాత టేప్ రికార్డర్ ఆన్‌చేసి అవే అబద్ధాలు.. మాయ మాటలు చెబుతున్నాడు’ అని ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం తొమ్మిదో రోజు రోడ్‌షో పెద్దాసుపత్రి నుంచి ప్రారంభమై ఏకలవ్యనగర్, సుంకులమ్మ గుడి, మారుతీనగర్ మంచినీళ్ల బావి, హరిజనపేట, చెన్నకేశవ స్వామి గుడి సెంటర్, జిలేబీ సెంటర్, కొలిమిపేట, షాదిక్‌నగర్ మీదుగా 21, 22 వార్డుల వరకు సాగింది. రోడ్‌షోలో భాగంగా నూనెపల్లెలోని మంచినీళ్ల బావి వద్ద ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అధర్మ పాలనకు చరమగీతం పాడటానికి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
అవినీతి డబ్బు ఉందని అహంకారం
‘‘మూడున్నరేళ్లుగా ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌తో సహా కేబినెట్ సభ్యులందరూ నంద్యాల రోడ్లపై కనిపిస్తున్నారు.ఉప ఎన్నిక వచ్చేసరికి మళ్లీ పాత టేప్ రికార్డర్ ఆన్ చేశారు. ఈ మూడున్నరేళ్లలో తాను లంచాల రూపంలో సంపాదించిన అవినీతి డబ్బుతో ఏమైనా చేయొచ్చనేది బాబు ధీమా. ‘డబ్బుతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేశా. చిన్నాచితక లీడర్లను కొనేశా. ప్రజలను కొనడం ఒక లెక్కా. వారిని కూడా కొనేస్తా’నన్న అహంకారంతో ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని బాబు కుట్రలు పన్నుతున్నారు. నంద్యాలలో దారుణమైన పరిస్థితుల మధ్య జరుగుతోన్న ఈ ఉప ఎన్నికలో ప్రజలు బాబు చేసిన మోసానికి, అన్యాయానికి, దుర్మార్గానికి, అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేయండి.
డబ్బు మూటలతో వస్తారు..
రాబోయే రోజుల్లో చంద్రబాబు లంచాల రూపంలో సంపాదించిన డబ్బు మూటలతో మీ ఇంటికి వస్తారు. మీ చేతిలో రూ.5 వేలు పెట్టి.. ఆ తర్వాత జేబులో నుంచి దేవుడి పటం తీసి చేతిలో పెట్టి.. దేవుడి మీద ప్రమాణం వేయించుకుని మరీ డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ప్రజలు లౌక్యంతో వ్యవహరించి ధర్మానికే ఓటు వేసి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలి. ప్రియతమ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోతూ ఇచ్చిన ఇంత పెద్ద కుటుంబం నాకున్న ఆస్తి. నాన్నగారు చేసిన ఆ సంక్షేమ పథకాలు ఇంకా మీ గుండెల్లో బతికే ఉండటం నాకున్న ఆస్తి. జగన్ అబద్ధం ఆడడు. జగన్ మాట ఇస్తే తప్పడు. ఏదైనా చెబితే చేస్తాడు.. అన్న విశ్వసనీయత నాకున్న ఆస్తి. నవరత్నాలతో జగన్ కూడా ప్రతీ పేదవాడి ఇంట్లో వెలుగులు నింపుతాడు.. వాళ్ల నాన్న మాదిరిగానే పేదల కోసం తపిస్తాడని ప్రజల్లో ఉన్న నమ్మకం నాకున్న ఆస్తి. దేవుడి దయ.. మీ ఆశీస్సులే నాకున్న ఆస్తి.’’ అని జగన్ అన్నారు.