ఆర్తితో..ఆత్మీయంగా | YS Jagan consoles Vakatippa fire cracker explosion victims | Sakshi
Sakshi News home page

ఆర్తితో..ఆత్మీయంగా

Published Thu, Oct 23 2014 1:29 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

ఆర్తితో..ఆత్మీయంగా - Sakshi

ఆర్తితో..ఆత్మీయంగా

అయిన వారిని పొట్టన పెట్టుకుంటున్న అగ్నికీలలు ఆరిపోయినా.. ఆ ఘోరం గుండెల్లో రగిల్చిన శోకాగ్నితో దహించుకుపోతున్న వారికి ఓ చల్లని పలకరింపు వినిపించింది. కన్నీటితో తడిసిన వారి చెక్కిళ్లను రెండు చేతులు ఆర్తిగా తాకాయి. వెలుగుల పండుగ ముందు అలముకున్న విషాదపు చీకటిలో ఓ ఊరడింపు లభించింది. కలత చెందిన వేళ, కళ్లు  తడిసిన వేళ ‘నేనున్నాను’ అంటూ కదిలి వచ్చి, తమ వ్యధకు కదిలిపోయిన జగన్‌ను చూసి వాకతిప్ప విస్ఫోటం బాధితులకు.. కొత్తగా ఓ ఆత్మీయుడు దక్కినట్టనిపించింది.
 
 పిఠాపురం/మండపేట :‘మా అమ్మ బుగ్గయిపోయిందన్నా!’ ముగ్గురు బాలికల విలాపం.. ‘అయ్యా నా ఇద్దరు కోడళ్లు, కూతురు కడతేరిపోయారు’ పడమటి పొద్దున ఓ వృద్ధురాలి పుట్టెడు దుఃఖం.. ‘బాబూ! ఈ బిడ్డలను ఎలా సాకేది?’ ఒక తల్లి ఆవేదన. తమను పరామర్శించేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బుధవారం వాకతిప్ప మణికంఠ ఫైర్‌వర్క్స్‌విస్ఫోటం బాధితులు వినిపించిన వ్యధ ఇది. జగన్ తమను చూడడానికి రాగానే వారి దుఃఖం కట్టలు తెంచుకుంది. ‘ఘోరం  జరిగిపోయిందయ్యా’ అంటూ బావురుమన్నారు. వారు గోలుగోలున విలపిస్తుంటే.. చలించిన జగన్ కళ్లు చెమ్మగిల్లాయి. ఆ భావోద్వేగంతోనే బాధితుల్ని అక్కున చేర్చుకుని ఊరడించారు.
 
 ‘అండగా ఉంటాను. ధైర్యం కోల్పోవద్దు’ అని భరోసానిచ్చారు. జగన్ తొలుత కాకినాడ  అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు కుక్కల శ్రీనివాసరావు,  ఫైర్‌వర్క్స్ అధినేత కొప్పిశెట్టి అప్పారావు, అతడి తల్లి లక్ష్మిలను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.   అదే ఆస్పత్రిలో పార్టీ నాయకుడు, స్థానిక మాజీ కార్పొరేటర్ చామకూర నాగబాబు చికిత్స పొందుతున్న విషయాన్ని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ద్వారా తెలుసుకున్న జగన్ ఆయనను కూడా పరామర్శించారు. అనంతరం పేలుడు మృతుల స్వగ్రామాలైన పెదకలవల దొడ్డి, నిదానం దొడ్డి, వాకతిప్ప ఎస్సీ కాలనీలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. పేలుడు సంభవించిన చోటును పరిశీలించారు.
 
 బాధితుల వేదనతో కదిలిపోయిన జగన్
 నిదానందొడ్డిలో పిల్లి కాంతం తన కుమార్తె, మనవళ్లను కోల్పోయానంటూ జగన్ వద్ద కన్నీరుమున్నీరైంది. తండ్రిని కోల్పోయానంటూ రాయుడు రాఘవ కుమార్తె మేడిశెట్టి మురారి, తల్లి చనిపోయిందంటూ పుట్టా నాగమణి కుమారుడు దావీదు, తన కూతురు ఇక లేదంటూ మేడిశెట్టి నూకరత్నం తండ్రి సత్యనారాయణ బోరున విలపించారు. వారి ఆవేదనను చూసి చలించిపోయిన జగన్ తమాయించుకుని వారిని ఓదార్చారు. కన్నీళ్లు తుడిచి అధైర్యపడవద్దని, అం డగా ఉంటానని చెప్పారు. ప్రమాదంలో ఇద్దరు కోడళ్లు, కుమార్తెను కోల్పోయానంటూ ఎస్సీ కాలనీకి చెందిన మసకపల్లి రూతమ్మ, తన ఇద్దరు కోడళ్లు కడతేరిపోయారంటూ మరిడమ్మ గొల్లుమన్నారు. ఉండ్రాసపు కీర్తి అమ్మమ్మ పోలీసమ్మ, మసకపల్లి అప్పయ్యమ్మ కుమార్తె సత్యవతి, ద్రాక్షారపు కాంతం కుమారుడు నాగేశ్వరరావును, వారి కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. తనను చూసి బాధితులు ప సిపిల్లల్లా వలవలా ఏడుస్తుంటే తట్టుకోలేని ముంగాళ్లపైనే వారి ముందు కూర్చుని కన్నీరు తుడిచారు.
 
 ప్రమాదంతో కూడిన పని ఎందుకమ్మా?
 ‘అమ్మా! ఈ పనికి వెళితే ఎంత కూలీ ఇస్తారు?’ అని జగన్ బాధితులను అడగ్గా ‘రోజుకు రూ.150 ఇస్తా’రని చెప్పారు. ‘వేరే పనిచేసుకోవచ్చు కదా.. ఇంత ప్రమాదంతో కూడుకున్న పని ఎందుకు చేస్తున్నార మ్మా?’ అని ప్రశ్నించినప్పుడు కొన్ని నెలలుగా ఉపాధి పనులు లేవని, ప్రస్తుతం వ్యవసాయ పనులు కూడా లేకపోవడంతోనే బాణ సంచా తయారీకి వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. గతంలో మగవారు మా త్రమే వెళ్లేవారని, ఈ ఏడాది పనుల్లేకపోవడంతో గత నెల రోజులుగా మహిళలు కూడా బాణ సంచా తయారీకి వెళుతున్నారని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని చెప్పారు. తన తల్లి ద్రాక్షారాపు చినతల్లి ఈ ప్రమాదంలోనే మృతి చెందిందని ఆమె కుమార్తె దూలపల్లి నాగలక్ష్మి వాపోయింది. అయితే తన తల్లి మృతదేహం గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నందున పరిహారం ఇవ్వడానికి అధికారులు నిరాకరిస్తున్నారని వాపోయింది. ఉదయం 9.10 గంటలకు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంటి నుంచి ప్రారంభమైన జగన్ పర్యటన మధ్యాహ్నం 1.15 గంటల వరకు సాగింది. అనంతరం జగన్ మధురపూడి ఎయిర్‌పోర్టు చేరుకుని 2.30 గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
 
 18కి చేరిన వాకతిప్ప మృతులు
 వాకతిప్పలో పేలుడులో మృతుల సంఖ్య 18గా అధికారులు నిర్ధారించారు. ఆచూకీ లేకుండా పోయిన యు. కీర్తి కూడా మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అయితే ద్రాక్షారపు చినతల్లి మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో తహసీల్దారు విచారణ అనంతరం మృతిని ధ్రువీకరించాలని నిర్ణయించారు.  ఇప్పటికే రూ.3 లక్షల చొప్పున పంపిణీ చేసిన అధికారులు చినతల్లి పరిహారాన్నే ఆపారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement