
పిఠాపురం: ప్రజా సంకల్పయాత్రలో భాగంలో పాదయాత్ర చేస్తోన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఏఎంసీ మాజీ చైర్మన్ బాబ్జీ, శ్రీ సంస్థానం మాజీ చైర్మన్ రామకృష్ణతో పాటు మరో ఆరుగురు టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి వైఎస్ జగన్, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్ బాబ్జీ మాట్లాడుతూ..టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన తప్పుడు హామీలతో మోసపోయామని, మాజీ చైర్మన్ అయిన తనకే రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సందర్భంలో మరికొంత మంది చేనేత సంఘాల ప్రతినిధులు కలిసి తమ ఇబ్బందులు వైఎస్ జగన్‌తో చెప్పుకున్నారు. జీఎస్టీతో ఇబ్బందులు పడుతున్నామని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేలు చేయాలని విన్నవించుకున్నారు.
పిఠాపురం జాతీయ రహదారిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని న్యాయవాదులు కలిశారు. 2014 ఎన్నికలకు ముందు తమకు కూడా ఇళ్ల స్థలాలు, డెత్ బెనిఫిట్స్ మంజూరు వంటి అనేక హామీలు చంద్రబాబు ఇచ్చాడని వైఎస్ జగన్‌కు చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజల్లానే తమను కూడా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులకు స్టైఫండ్, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ వైఎస్ జగన్‌కు న్యాయవాదులు వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment