సాక్షి, తూర్పు గోదావరి/పత్తిపాడు : రాష్ట్రాంలో తాగు నీరులేని గ్రామాలు ఉన్నాయి తప్ప మద్యం షాపులు లేని గ్రామం ఒక్కటి కూడా లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నారాయణ, శ్రీచైతన్య పాఠశాలలు అధిక ఫీజులతో పేదవాడిని దోచుకుంటున్నాయని, ఇంజినీరింగ్, డాక్టర్ చదువులు చదవాలంటే భూములు, బంగారం, ఇళ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, ప్రైవేటు స్కూల్స్, కాలేజీల అధిక ఫీజులకు కళ్లెం వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడిలో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలను టీడీపీకి ఇస్తే.. అవి చాలవనట్టు వైఎస్సార్‌సీపీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా సంతలో పశువుల్లా చంద్రబాబు కొనుగోలు చేశారని ఆయన మండిపడ్డారు.
17 మంది ఎమ్మెల్యేలను పక్కనపెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడుతూ.. జిల్లాలో పెట్రోలియం యూనివర్సిటీ, పెట్రోలియం కారిడార్, నౌకా నిర్మాణం, ఎలక్ట్రానిక్ పార్కు, విశాఖ-చెన్నై ఇండ్రస్ట్రియల్ కారిడార్ నిర్మిస్తామని హామీ ఇచ్చారని, నాలుగేళ్ల పాలనలో వాటికి ఇంతవరకు పునాది కూడా పడలేదని వైఎస్ జగన్ విమర్శించారు. ‘రాష్ట్రానికి ప్రాణవాయువులాంటి పోలవరం ప్రాజెక్టును అవినీతిమయంగా మార్చారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో పోలవరం కనీసం పునాదులు కూడా పూర్తికాని పరిస్థితి. కాంట్రాక్టుల ద్వారా లంచాలను దండుకోవాడానికి పొలవరం ప్రాజెక్టును సాకుగా చూపుతున్నారు. రాష్ట్రమంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్‌గా ఉన్నారు. ఆయన ద్వారానే లంచాలు మంత్రులు, చినబాబు వద్దకు చేరుతున్నాయి’ అని వైఎస్ జగన్ అన్నారు.
‘ఇదే నియోజకవర్గంలో ఉన్న అన్నవరం సత్యనారాయణ ఆలయంలో శుభ‍్రం చేసే కాంట్రాక్టరు స్వయంగా చంద్రబాబు సమీప బంధువు. గతంలో ఆ కాంట్రాక్టు కేవలం ఏడు లక్షలు. దానిని చంద్రబాబు సీఎం అయ్యాక తన వాటాకోసం 32 లక్షలకు పెంచారు. లంచాల విషయంలో దేవుడిని కూడా వదిలిపెట్టడంలేదు. దేవుడిని కూడా దోచుకుంటున్నారు. నీరు చెట్టు పథకంలో ఇసుక, మట్టిని తోడేసి లంచాలు దన్నుకుంటూ భూ బకాసురులుగా మారారు.
వైఎస్‌ఆర్ హయంలో పేదలకు పదిలక్షల ఇళ్లు కట్టించారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలన కనీసం ఊరికి నాలుగు ఇళ్లు కూడా కట్టించలేదు. ఎన్నికల సమయంలో జిల్లాలో జూనియర్ కాలేజీ కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు పునాది కూడా పడలేదు. 30 పడకుల కమ్యూనిటీ ఆసుపత్రిలో డాక్టర్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని మూసి వేసి, ప్రజలు ప్రయివేటు ఆసుపత్రికి పోయేల ప్రభుత్వం కుట్ర చేస్తొంది. రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రుణమాఫీ లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో చేసిన రుణమాఫీ రైతులకు కనీసం వడ్డీలకు కూడా సరిపోవట్లేదు. కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఏలాంటి రుణాలు అందడం లేదు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కౌలు చట్టాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. పంటలకు మద్దతు ధరలేక రోడ్లమీద పారపోస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోంది. జాబు రావాలంటే బాబు రావాలి అన్నారు. బాబు వచ్చాడు, నిరుద్యోగులకు జాబు మాత్రం రాలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. నాలుగేళ్లయిన కూడా ఆ ఊసే లేదు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment