చెదిరిన గుండెలకు అండగా.. | YSRCP leaders meet on Vakatippa cracker explosion victims | Sakshi
Sakshi News home page

చెదిరిన గుండెలకు అండగా..

Published Sun, Oct 26 2014 12:10 AM | Last Updated on Tue, May 29 2018 2:26 PM

చెదిరిన గుండెలకు అండగా.. - Sakshi

చెదిరిన గుండెలకు అండగా..

 వాకతిప్ప విస్ఫోట బాధితులకు వైఎస్సార్‌సీపీ దన్ను
  మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున అందించిన నేతలు
  పూర్తి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ
  క్షతగాత్రులకూ, పంట నష్టపోయిన రైతులకూ ఆర్థిక సహాయం

 
 పిఠాపురం :గుండెను పిండే కష్టం విరుచుకుపడ్డ వేళ కన్నీరు తుడిచి, ఊరడించడమే కాక.. అండగానూ నిలిచే రివాజును వైఎస్సార్ కాంగ్రెస్ మరోసారి చాటుకుంది. వెలుగుల పండుగ ముందు కారుచీకట్లు కమ్ముకున్న వాకతిప్ప విస్ఫోటం బాధితులకు ఆర్థిక సాయం అందజేసింది. వారికి న్యాయం జరిగే వరకు దన్నుగా నిలుస్తామని భరోసానిచ్చింది. యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలోని బాణసంచా తయారీ కేంద్రంలో గత సోమవారం సంభవించిన పెను విస్ఫోటం 18 మందిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన గురించి విన్న వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తరాంధ్ర నుంచి జిల్లాకు వచ్చి, బుధవారం బాధితులను ఓదార్చారు. దుర్ఘటన జరిగిన చోటును పరిశీలించారు. జరిగిన విధ్వంసాన్నీ, అనేక కుటుంబాల్లో  అలముకున్న విషాదాన్నీ చూసి విచలితుడైన ఆయన పార్టీ తరఫున వారికి చేయూతనివ్వాలని సంకల్పించారు.
 
 ఈ క్రమంలో ఆయన ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, జగ్గంపేట ఎమ్మెల్యే  జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్,  ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, కో ఆర్డినేటర్లు అనంత ఉదయభాస్కర్, కొండేటి చిట్టిబాబు, మాజీ జెడ్పీటీసీ రావు చిన్నారావు, కాకినాడ నగర కన్వీనర్ ఫ్రూటీ కుమార్, ఎంపీపీ పెట్టా శ్రీనివాసరావు తదితరులు శనివారం  వాకతిప్ప వెళ్లారు. పేలుడు ఘటనలో బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు  రూ.50 వేలు, గాయపడ్డ వారికి రూ.20 వేల చొప్పున అందజేశారు. పంట నష్టపోయిన ముగ్గురు రైతులకూ ఆర్థికసాయం అందించారు.
 
 ఊరడించి, ఊతమిచ్చారు..
  వైఎస్సార్ సీపీ నాయకులు తొలుత కుతుకుడుమిల్లి శివారు నిదానం దొడ్డిలోఅక్కడి మృతులు తుట్టా మంగ, ఆమె కుమారుడు సత్తిబాబుల కుటుంబ సభ్యులైన చంద్రరావు, నూకరత్నం చినతల్లిలను పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన మరో మృతురాలు రాయుడు రాఘవ భర్త అబ్బాయి, కుమారులు గోవిందు, బంబోజి, చిన్న, కుమార్తె చిన్నారి, మరో మృతురాలు మేడిశెట్టి నూకరత్నం తండ్రి సత్తిబాబు, తల్లి సత్యవతి, అన్నయ్య అప్పలరాజు, మరో మృతురాలు తుట్టా నాగమణి భర్త అప్పలరాజు, కుమారుడు గోవిందు, కుమార్తెలు సుభాషిణి, సంధ్యారాణిలను పరామర్శించి ఆర్థికసాయం అందించారు. అనంతరం  పెదకలవల దొడ్డి వెళ్లి ఆగ్రామానికి చెందిన మృతుడు పిల్లి  వీర మణికంఠస్వామి తల్లి కామేశ్వరి, తండ్రి సత్తిబాబు, మరో మృతుడు  దమ్ము గుర్రయ్య భార్య మంగ, కుమార్తెలు విమలాదేవి, ప్రమీలలను ఓదార్చి సాయం అందజేశారు.
 
 దుర్ఘటనలో తీవ్ర గాయాలైన కుక్కల శ్రీను భార్య రమణమ్మను, కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్బంగా  బాధితులు బోరున విలపిస్తూ తమ దుస్థితిని ఏకరువు పెట్టగా.. అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తామని ధైర్యం చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వాకతిప్పలో వాసంశెట్టి రాఘవ కుటుంబాన్ని పరామర్శించి, ఆమె కుమారుడికి ఆర్థికసాయం అందించారు. తర్వాత అక్కడి ఎస్సీ పేటకు చేరుకుని మృతి చెందిన మసకపల్లి గంగ, మసకపల్లి అప్పయ్యమ్మ, మసకపల్లి విజయకుమారి, మసకపల్లి కుమారి, ద్రాక్షారపు కాంతం, ద్రాక్షారపు చినతల్లి, అద్దంకి నూకరత్నం, మసకపల్లి పుష్ప, ఉలంపర్తి కామరాజు, ఉండ్రాజపు కీర్తిల ఇళ్లకు వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.
 
 పంట నష్టపోయినవారినీ ప్రభుత్వం ఆదుకోవాలి..
 పేలుడు వల్ల పరిసరాల్లోని పంటచేలూ కొంత మేరకు ధ్వంసమయ్యాయి. ఆ నష్టాన్ని కళ్లారా చూసిన జగన్ ఆదేశాల మేరకు పార్టీ తరఫున ఆ రైతులకూ శనివారం సాయం అందించారు. నష్టాన్ని బట్టి ఇద్దరు రైతులకు రూ.10 వేల చొప్పున, మరో రైతుకు రూ.5 వేలు అందజేశారు. పేలుడు వల్ల నష్టపోయిన రైతులనూ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వెంగళి సుబ్బారావు, పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్  గండేపల్లి బాబి, అత్తిలి సీతారామస్వామి, అడ్డగళ్ల సాయిరాం, విప్పర్తి వేణుగోపాల్, నక్కా రాజబాబు, చెల్లుబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement