రుణ మాఫీ కోసం ఇక పోరుబాట
రుణ మాఫీ కోసం ఇక పోరుబాట
Published Sat, Sep 20 2014 2:09 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
అక్టోబర్ 16న తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా
సాక్షి, అనంతపురం: రుణ మాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను మోసగించిన చంద్రబాబు అసలు స్వరూపాన్ని బయట పెట్టడంతోపాటు, రుణమాఫీ అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అక్టోబర్ 16న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలతో మనోవేదనకు గురవుతున్న రైతన్నలకు దన్నుగా, అక్కాచెల్లెళ్లకు అండగా నిలవాలన్నదే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. అక్టోబర్ 16న తహశీల్దార్ కార్యాలయాల ఎదుట చేపట్టనున్న ధర్నాలో రాష్ట్రవ్యాప్తంగా ఆయా మండలాల పరిధిలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, అక్కాచెల్లెళ్లు పాల్గొని చంద్రబాబు మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అనంతపురంలోని బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఉన్న రామకృష్ణ ఫంక్షన్ హాలులో రెండు రోజులపాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్షలు నిర్వహించారు. శుక్రవారం అనంతపురం, కళ్యాణదుర్గం, రాప్తాడు, రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల సమీక్ష ముగింపులో ఆయన మాట్లాడారు. అనంతరం మీడియాతోనూ ఆయన మాట్లాడారు. ఆయన ప్రసంగాల్లోని ముఖ్యాంశాలు...
చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోవడంతో డ్వాక్రా చెల్లెమ్మ పొదుపు ఖాతాలో నుంచి బ్యాంకు అధికారులు డబ్బులు తీసేసుకుంటున్నారు. దీంతో కడుపుమండి చెల్లెమ్మలు నిన్నటికి నిన్న శ్రీకాకుళంలో చుట్టుముట్టారు. మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తాను.. మీ వడ్డీనంతా నేనే కడతానని బాబు మోసపూరిత హామీ ఇచ్చారు. ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఇప్పుడిస్తున్నది వడ్డీ లేని రుణాలే కదా!
చంద్రబాబు మాటలు నమ్మి.. బ్యాంకులకు పాత రుణాలు చెల్లించక, కొత్త రుణాలు పుట్టక, రైతులు పంటలు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. జూన్ 30లోపు రుణాలు కట్టలేదు కాబట్టి 13 శాతం వడ్డీ సహా బకాయిలు చెల్లించాలని బ్యాంకులు చెబుతున్నాయి. కొత్త రుణాలు ఇవ్వడం లేదు. పంటల బీమా లేదు. ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తున్నారు. అలాంటి బాబును రక్షించేందుకు టీవీ-9, ఈనాడు, ఆంధ్రజ్యోతి కలసికట్టుగా పని చేస్తున్నాయి.
బీసీలపై బాబు కపట ప్రేమ
ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కేందుకే బీసీ రిజర్వేషన్ల తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారే తప్ప బీసీలపై ప్రేమతో కాదు. అనంతపురంలో ముగ్గురు బీసీ ఎమ్మెల్యేలు గెలిస్తే వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడమే బాబుకు బీసీలపై ఉన్న కపట ప్రేమకు నిదర్శనం.
ప్రస్తుతం రాష్ట్రంలో తమిళనాడు తరహాలో రెండే పార్టీలు ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ, టీడీపీ నిర్దేశించిన మూడోవంతు నియోజకవర్గాల్లో బీసీలకే టికెట్లు ఇస్తే అప్పుడు ఏ పార్టీవారు గెలిచినా అసెంబ్లీలో బీసీలకు మూడోవంతు ప్రాతినిధ్యం ఉంటుంది. అందుకు మా పార్టీ సిద్ధంగా ఉంది. చంద్రబాబు సిద్ధమేనా?
పచ్చ చొక్కాల వారి కోసమే 135 జీవో
పేదలకు అందాల్సిన పింఛన్లను పచ్చ చొక్కాలవారికి అందించడానికి బాబు భారీ కుట్రకు తెరలేపారు. ఇందులో భాగంగానే 135 జీవో జారీ చేశారు. ఈ జీవో ప్రకారం పింఛన్ లబ్ధిదారుల అర్హతలను గుర్తించడానికి వేసే కమిటీల్లో సభ్యులను నిర్ణయించే అధికారాన్ని మంత్రులకు కట్టబెట్టారు. టీడీపీ మంత్రులు నిర్ణయించిన వ్యక్తులతో కమిటీల ఏర్పాటు, ఆ కమిటీలు నిర్ణయించిన వారికే పింఛన్లు అందుతాయంటే ఏం జరగనుందో తెలుస్తోంది.
ఏపీలో 43,11,688 మంది పింఛన్‌దారులుండగా కొత్త పింఛన్లకోసం 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్త దరఖాస్తులను పక్కన పెట్టినా, ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ మొత్తం నెలకు రూ.130 కోట్లు చొప్పున ఐదు నెలలకు రూ.650 కోట్లు అవుతుంది. అక్టోబర్ 2 నుంచి పెంచనున్న మొత్తంతో ఏడు నెలలకు రూ.3,050 కోట్లు అవుతుంది. అంతా కలిపి రూ.3700 కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్‌లో చంద్రబాబు రూ.1338 కోట్లే కేటాయించారు. ఈ కేటాయింపులను బట్టి చూస్తే పింఛన్లలో భారీగా కోత పెట్టడానికి జరుగుతున్న కుట్ర ఎవరికైనా అర్థమవుతుంది. మరోవైపు ఇప్పుడు పింఛన్లు అందుకుంటున్న వారిలో చాలామంది అనర్హులు ఉన్నారనే కొత్త నాటకానికి తెర లేపారు.
Advertisement
Advertisement