
సాక్షి, విజయవాడ: నగరంలోని హోటల్ తాజ్ గేట్‌వేలో శుక్రవారం ఉదయం 10గంటలకు డిప్లొమాటిక్ ఔట్‌రీచ్ సదస్సు ప్రారంభం కానున్నది. భారత విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరకానున్నారు. పలు కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో సీఎం వైఎస్ జగన్ కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్ ప్రారంభ ఉపన్యాసం.. అనంతరం రాష్ట్రంలో పారిశ్రామిక విధానంపై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రసంగిస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం.. నవరత్నాలు, పెట్టుబడులు, టూరిజం, హెల్త్ సెక్టార్ వంటి కీలక అంశాలపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మధ్యాహ‍్నం భోజన విరామం అనంతరం సీఎం వైఎస్ జగన్ పలువురు రాయబారులు, కాన్సులేట్ జనరల్‌లతో ముఖాముఖి నిర్వహిస్తారు. కాగా ఈ సదస్సులో యూఎస్‌ఏ, యూకే, జపాన్, కెనడా, కొరియా, సింగపూర్, ఆస్ట్రియా, పోలాండ్, ఆస్ట్రేలియా, టర్కీ తదితర 35 దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.