
నేడు నెల్లూరుకు వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నెల్లూరుకు రానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి కడప నుంచి బయలుదేరి మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు చేరుకుంటారని పేర్కొన్నారు. ఇక్కడ పినాకిని అతిథి గృహంలో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులతో సమావేశమవుతారని తెలిపారు.
అనంతరం కనుపర్తిపాడుకు సమీపంలోని వీపీఆర్ కన్వెన్షన్‌లో జరిగే ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోదరుడు భద్రారెడ్డి కుమార్తె తన్మయి, చెన్నైకు చెందిన పారిశ్రామికవేత్త అనిల్‌కుమార్‌రెడ్డి కుమారుడు అభినయ్‌ల వివాహ వేడుకకు హాజరవుతారని పేర్కొన్నారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం రాత్రి హైదరాబాద్ వెళుతారని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘనంగా స్వాగతం పలికేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు.