
కోవెలకుంట్ల/నంద్యాల టౌన్/ఆళ్లగడ్డ: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రజా సంకల్ప యాత్ర శనివారం పత్తికొండ నియోజకవర్గంలోని రాతన గ్రామానికి చేరుకోగా పింఛన్లు, పక్కాగృహాలు, రుణమాఫీ, సంక్షేమ పథకాలు వర్తించడం లేదని మహిళలు వైఎస్ జగన్‌కు సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మహిళలతో మాట్లాడుతూ మాయమాటలు చెప్పి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఈ దుర్మార్గ పాలనలో చంద్రబాబుపై పోరాటం చేస్తున్నామని ధ్వజమెత్తారు. ‘వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే నవరత్నాలతో ప్రజలకు లబ్ధి చేకూరుస్తాం. మీ (రాతన)గ్రామంలో ఏ ఒక్కరు కూడా మాకు ఇల్లు లేదని చెప్పేవారు లేకుండా అందరికీ ఇళ్లు కట్టిస్తాం. రైతులు నష్టపోకుండా పంట వేసే ముందు గిట్టుబాటు ధర ప్రకటిస్తాం. పింఛన్ వయసును 45 ఏళ్లకు తగ్గించడంతో పాటు నగదును రూ.2 వేలకు పెంచుతాం. ఎన్నికల నాటికి ఉన్న డ్వాక్రా రుణ బకాయిలను నాలుగు విడతల్లో మహిళల చేతికే ఇస్తాం. బ్యాంకులకు వడ్డీ మొత్తాన్ని చెల్లించి అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలను అందిస్తాం. ఇద్దరు పిల్లలను చదివిస్తే ఏడాదికి రూ.15 వేల చొప్పున తల్లుల అకౌంట్లలో జమ చేస్తాం’ అని వైఎస్ జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు.
వలసపోతున్నామన్నా..
ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ‘ఎన్నికలప్పుడు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు కట్టవద్దని, అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు మాటలు నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ కాకపోగా వడ్డీ మీద వడ్డీ కడుతున్నాం. ఉపాధి పనులు లేక దూర ప్రాంతాలకు పిల్లలను వెంటబెట్టుకుని వలస(సుగ్గి) వెళుతున్నాం. మా పిల్లల చదువులు నాశనం అవుతున్నాయి’ అని వాపోయారు.
పంటలన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..
తుగ్గలి సమీపంలో మహిళా రైతులు శ్రీదేవి, సిద్దమ్మ, లత్తమ్మ, తదితరులు తెగులు సోకిన పత్తిపంటను వైఎస్ జగన్‌కు చూపించి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారితో మాట్లాడుతూ మనం అధికారంలోకి వస్తే అన్నదాతలు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం టమాటాలను లారీలో తీసుకెళుతున్న రైతులను ఆయన పలకరించారు. టమాటాల బుట్టను ఎంతకు విక్రయిస్తున్నారని అడగ్గా బుట్ట(25కిలోలు) రూ.150 నుంచి రూ.200 విక్రయిస్తున్నట్లు రైతులు తెలిపారు. వాటిని హెరిటేజ్‌లో ఎంతకు కొనుగోలు చేస్తున్నారని వైఎస్ జగన్ అడగ్గా కిలో రూ.50 నుంచి రూ.60కి కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. ‘వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే రైతులకు అన్ని విధాలా మేలు జరుగుతుందని అన్న చెప్పాడని అందరికీ ధైర్యంగా చెప్పండి’ అని వైఎస్ జగన్ సూచించారు.
ఇక నుంచి మీ కష్టాలు నావి..
‘ఇంత వరకు మీరు పడ్డ కష్టాలన్నీ నేను చూశాను. ఇక మీదట మీ కష్టాలు నావి. మీకు అండగా నేనుంటా’ అని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌సీపీ అ«ధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భరోసానిచ్చారు. ప్రజా సంకల్పయాత్ర శనివారం పత్తికొండ నియోజకవర్గంలోని రాతన గ్రామానికి చేరుకోగా మహిళలు వైఎస్ జగన్‌కు సమస్యలు విన్నవించారు. పంట సాగు చేసే ముందే ఆ పంటకు ఎంత అయితే గిట్టుబాటు అవుతుందో అంతరేటు నిర్ణయించి అన్ని పంటల దిగుబడులను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. చంద్రబాబునాయుడిలా రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి తన హెరిటేజ్ కంపెనీలో అత్యధిక ధరలకు విక్రయించేలా దళారీ పని మన
ప్రభుత్వం చేయదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment