భూ కేటాయింపులపై రగడ: జగన్
* ధూళిపాళ్లకు జగన్ సవాల్
* బ్రహ్మణి స్టీల్ స్థలంపై లోన్ తీసుకున్నట్టు నిరూపిస్తారా?
* సభలో లేని వ్యక్తిపై దాడేమిటి?
* గాలి జనార్దన్‌రెడ్డిని కాల్వ శ్రీనివాసులు
* సింగపూర్ తీసుకువెళ్లి చంద్రబాబుతో కలిపించారా? లేదా?: జగన్
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్)కు భూము ల కేటాయింపుపై సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా అధికార టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చేసిన వ్యాఖ్యలు సభలో ఈ గందరగోళానికి దారితీశాయి. గవర్నర్ ప్రసంగంలో లేని జలయజ్ఞం, సెజ్‌లకు భూ కేటాయింపులు వంటి అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. బ్రహ్మణి స్టీల్స్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ... బల్లులు కూడా గుడ్లు పెట్టని పది వేల ఎకరాల భూముల్ని ఆ సంస్థకు అప్పగించామని ఆనాటి ముఖ్యమం త్రి చెప్పారని, కానీ ఆ సంస్థ నిర్వాహకులు అటువంటి స్థలాన్ని తాకట్టు పెట్టి రూ.300 కోట్లు రుణం తీసుకున్నారని, స్థలాభివృద్ధికి 20 కోట్లు మాత్రమే వ్యయం చేశారని ఆరోపించారు. ఈ తరహాలో దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. కాకినాడ సెజ్‌కు 20 వేల ఎకరాలు కేటాయించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
జగన్ రెండు సవాళ్లు...
ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ధూళిపాళ్ల నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. కాకినాడ సెజ్ విషయంలో సభను తప్పుదోవ పట్టించేలా ధూళిపాళ్ల మాట్లాడుతున్నారంటూ... దానిపై నిజనిరూపణకు సిద్ధమా అంటూ శ్రీకాంత్‌రెడ్డి తరఫున సవాల్ విసిరారు. బ్రహ్మణి స్టీల్ స్థలాన్ని తాకట్టు పెట్టి రూ.300 కోట్ల రుణం తీసుకున్నట్టు నిరూపించగలిగితే శ్రీకాంత్‌రెడ్డి రాజీనామా చేస్తారని, లేకుంటే నరేంద్ర కుమార్ రాజీనామా చేస్తారా? అని సవాల్ చేశారు. ధూళిపాళ్ల రాజీనామాకు సిద్ధమంటే విచారణ జరిపిద్దామన్నారు.
ఇదే సందర్భంలో తానింకో సవాల్ కూడా చేస్తున్నానంటూ... కాల్వ శ్రీనివాసులు ద్వారా గాలి జనార్దన్‌రెడ్డి సింగపూర్‌లో చంద్రబాబును కలిసిన మాట నిజమా? కాదా? అని ప్రశ్నించారు. ‘చంద్రబాబు, జనార్దన్‌రెడ్డి, ఈ సభలోనే ఉన్న కాల్వ శ్రీనివాసుల పాస్‌పోర్టులు చెక్ చేయండి. వీసాలు ఉంటాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే గాలి జనార్దన్‌రెడ్డిని చంద్రబాబుతో కలిపించేందుకు కాల్వ శ్రీనివాసులు సింగపూర్ తీసుకువెళ్లారా? లేదా? ఈ విషయాన్ని ఎంతదాకా తీసుకువెళ్లేందుకైనా శ్రీకాంత్‌రెడ్డి సిద్ధం’’ అని సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి ఐదేళ్లయింది, ఆ తర్వాత పాలన చేసిన కాంగ్రెస్‌ను వదిలి నోటికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాల్వ శ్రీనివాసులు జవాబిది..
కాల్వ శ్రీనివాసులు స్పందిస్తూ జగన్ వ్యాఖ్యలను తోసిపుచ్చా రు. ధూళిపాళ్ల మళ్లీ కాకినాడ భూములు, సెజ్‌ల వ్యవహా రాన్ని మొదలుపెట్టారు. దీనికి అభ్యంతరం తెలిపిన ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్ ప్రసంగంపై మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు.
మైనారిటీ వాణి విన్పించనివ్వరా?
ఈ సందర్భంలో వైఎస్సార్‌సీపీ సభ్యులు జలీల్‌ఖాన్, జ్యోతు ల నెహ్రూ, శ్రీకాంత్‌రెడ్డి కూడా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. దానికి స్పీకర్ అంగీకరించలేదు. మైనారిటీ వాణి వినిపించడానికైనా అవకాశం ఇవ్వండని జలీల్‌ఖాన్ కోరారు. ఈ దశలో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని తమకు ఎవరిపైనా ద్వేషం లేదని తెలిపారు.