
పులివెందుల క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ జగన్
సాక్షి, కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయాన్నే ఇంటి నుంచి నేరుగా సీఎస్‌ఐ చర్చికి చేరుకుని కుటుంబసభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్ బెన్‌హర్‌బాబు క్రిస్మస్ విశిష్టతతోపాటు బైబిల్‌లోని దైవ సందేశాన్ని వివరించారు. ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ జగన్‌తోపాటు తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ, వైఎస్సార్ సోదరి విమలమ్మ, వైఎస్ జగన్ మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, చిన్నాన్న, పెదనాన్నలు వివేకానందరెడ్డి, సుధీకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్.పురుషోత్తంరెడ్డి, వైఎస్ జగన్ సోదరులు అనిల్‌రెడ్డి, సునీల్‌రెడ్డి ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు.తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనల అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిఒక్కరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం చర్చిలో అందరూ పెద్దఎత్తున కరతాళ ధ్వనులు చేస్తుండగా ఎస్.పురుషోత్తంరెడ్డి, ప్రకాష్‌రెడ్డితో వైఎస్ జగన్ క్రిస్మస్ కేక్ కట్ చేయించారు.