క్రిస్మస్ కేక్ కట్ చేస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘అందరికీ మెర్రీ క్రిస్మస్...’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి విజయవాడలోని ఏ–1 కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎం కొవ్వొత్తుల ప్రదర్శనకు సారథ్యం వహించి క్రిస్మస్ కేకును కట్ చేశారు. ప్రార్థనా గీతాల నడుమ బిషప్‌లు, పాస్టర్ల సందేశాలతో రెండు గంటలకుపైగా సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ క్లుప్తంగా తన సందేశాన్ని ఇచ్చారు.
క్రైస్తవుల సంక్షేమానికి పలు పథకాలు
రాష్ట్రంలో క్రైస్తవుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి షేక్ బేపారి అంజాద్ బాషా తెలిపారు. క్రీస్తు పుట్టుక సమాజానికి శాంతి, సంతోషాలను కలుగజేసిందన్నారు. క్రిస్మస్ ప్రాశస్త్యాన్ని ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత వివరించారు. రాష్ట్రంలో అక్షరాస్యత, విద్యా ప్రమాణాలను పెంచేందుకు అమ్మ ఒడి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం లాంటి సాహసోపేతమైన నిర్ణయాలను ముఖ్యమంత్రి తీసుకున్నారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపె విశ్వరూప్, పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సామినేని ఉదయభాను, కె.పార్థసారథి, కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కైలే జ్ఞానమణితో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment