సమైక్యతా పరిరక్షణ జగన్‌కే సాధ్యం
Published Tue, Dec 10 2013 2:54 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
సాక్షి, రాజమండ్రి :సమర్థుడైన నేత ఉండి ఉంటే రాష్ట్రం రెండు ముక్కలయ్యే పరిస్థితి వచ్చేది కాదని, మహానేత రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రానికి బలమైన నాయకత్వం కొరవడిందని వైఎస్సార్ కాంగ్రెస్ తూర్పు గోదావరి జిల్లా సమన్వయ కర్త భూమా నాగిరెడ్డి అన్నారు. రాష్ట్ర సమైక్యతను పరిరక్షించగల సత్తా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. జగన్‌ను ఓ సమర్థుడైన ఉద్యమనేతగా అభివర్ణించారు. స్థానిక రివర్‌బే హోటల్‌లో ఆయన సోమవారం ఉదయం రాజమండ్రి సిటీ, సాయంత్రం రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ సోనియాను సైతం లెక్కచేయక కాంగ్రెస్‌లోని వైఫల్యాలను ఎప్పుడో ఎత్తి చూపారన్నారు. ఆయన స్ఫూర్తితో ఇప్పుడు యావద్దేశం సోనియా నాయకత్వాన్ని ప్రశ్నిస్తోందని, అందుకు నిదర్శనమే నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలని విశ్లేషించారు. జగన్ ముందు చూపు కలిగిన నేతగా కొనియాడారు. అధికార కాంగ్రెస్, ఆ పార్టీతో కుమ్మక్కయిన టీడీపీ ఇబ్బందుల పాలు చేస్తున్నా రాష్ట్ర పరిస్థితులు చక్కదిద్దేందుకు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సంకల్పించారన్నారు. ఆ క్రమంలోనే జాతీయనేతలను ఏకంచేసే బృహత్తర బాధ్యతను నెత్తికెత్తుకున్నారన్నారు. ఎన్ని ఒత్తిడులున్నా, ఎంత తీరిక లేకున్నా ఏ మూల ఏ కార్యకర్తకు సమస్య ఏర్పడ్డా తక్షణం స్పందిస్తూ నాయకత్వ పటిమ గల నేతగా వ్యవహరిస్తున్నారన్నారు.
ఇతర పార్టీల కుయుక్తులను తిప్పికొట్టండి..
వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రజా సంక్షేమమే పరమావధి అని, జగన్ నాయకత్వంలోనే ప్రజ ల సర్వతోముఖ వికాసం సాధ్యమని భూమా అన్నారు. ఇతర పార్టీల కుయుక్తులను తిప్పి కొట్టాలని, ప్రజాసేవ పట్ల పార్టీ నిబద్ధతను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నాయకులు మరింత ఐక్యతతో పని చేసి పార్టీని ఇతోధికంగా బలోపేతం చేయాలని సూచించారు. డివిజన్, గ్రామస్థాయిలలో కార్యకర్తలను కలుపుకొంటూ పార్టీ పునాదులను మరింత పటిష్ట పరచాలన్నారు. డివిజన్ కమిటీల ఏర్పాటు, క్షేత్రస్థాయిలో నాయకత్వ నియామకాలు,
ప్రజల్లో పార్టీ బలం తదితర అంశాలపై కార్యకర్తలు కొన్ని సూచనలు చేశారు. నియోజక వర్గ కన్వీనర్లు వివిధ సెల్‌ల కన్వీనర్‌లతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఆయా విభాగాలను చైతన్యం చేస్తూ ఉండాలని అభిప్రాయపడ్డారు. అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్న భూమా ఆ మేరకు పార్టీలో మార్పులు తేవాలని స్థానిక నాయకత్వానికి సూచించారు. నియోజక వర్గాల కో ఆర్డినేటర్లు ప్రతి కార్యకర్త సమస్యలపై స్వయంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అప్పుడే కిందిస్థాయి కార్యకర్తలకు అందుబాటులో ఉండడమే కాక స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు. పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి తాను అధిష్టానానికి నివేదిస్తానని చెప్పారు.
మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలి : కుడుపూడి
పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ గ్రామస్థాయి, డివిజన్ స్థాయి కమిటీల ఏర్పాటుకు షెడ్యూలు సిద్ధం అయిందని, ఆ ప్రకారం అందరు నేతలు సమష్టిగా నిర్ణయం తీసుకుని కమిటీలకు తుది రూపును ఇవ్వాలని సూచించారు. పార్టీలో మహిళా నాయకత్వం మరింత చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వారికి కేటాయించిన రిజర్వేషన్‌ల మాదిరిగానే పార్టీలో కూడా మహిళా నేతలు, కార్యకర్తల సంఖ్య 50 శాతం ఉండాలన్నారు. ప్రస్తుతం ఉన్న మహిళా నాయకత్వం ఈ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి,
రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజమండ్రి అర్బన్ కో ఆర్డినేటర్లు బొమ్మన రాజ్‌కుమార్, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, యువనేత జక్కంపూడి రాజా తదితరులు తమ సలహాలు, సూచనలు అందించారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, మైనారిటీ సెల్ కన్వీనర్ నయీం భాయి, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ గెడ్డం రమణ, సాంస్కృతిక విభాగం కన్వీనర్ గారపాటి ఆనంద్, పి.గన్నవరం కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, ఎస్సీ విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు మాసా రాంజోగ్, బీసీ విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు మార్గాని రామకృష్ణ గౌడ్, ప్రచార కమిటీ సభ్యులు ఎన్.వసుంధర, కె.వి.ఎల్.శాంతి, ముఖ్య నేతలు చోడిశెట్టి రాఘవబాబు, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, ఆదిరెడ్డి వాసు, పలువురు మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అర్బన్ కన్వీనర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement