బలవంతంగా హైదరాబాద్‌కు వైఎస్ జగన్ తరలింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చిన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పోలీసులు బలవంతంగా హైదరాబాద్ తరలించారు. ఆయనతో పాటు మరో ఆరుగురు నాయకులను కూడా అదే విమానంలో హైదరాబాద్ పంపేశారు. విమానాశ్రయం బయటకు కూడా రానివ్వకుండా దాదాపు మూడు గంటలకు పైగా లోపలే నిర్బంధించిన ఆయనను.. ఒక ప్రత్యేక విమానం రప్పించి, అక్కడకు బలవంతంగా తరలించి, లోపలకు పంపారు. వెంటనే విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించారు.
కొవ్వొత్తుల ర్యాలీలో తాను పాల్గొంటానని పోలీసులను జగన్ మోహన్ రెడ్డి కోరినా.. వారు అందుకు అంగీకరించలేదు. ముందునుంచే బీచ్ రోడ్డు మొత్తాన్ని దిగ్బంధించి, అటువైపు ఒక్క పురుగును కూడా అనుమతించని పోలీసులు జగన్ అటువైపు చేరుకుంటే ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతం అవుతుందని భావించిన ప్రభుత్వం.. ఆయనను అసలు ర్యాలీలో కూడా పాల్గొననివ్వకుండా అడ్డుకుంది. అయితే ప్రజలు మాత్రం తమ నాయకుడిని చూసేందుకు భారీ సంఖ్యలో విమానాశ్రయం బయట చేరుకుని, కొవ్వొత్తులు వెలిగించి నినాదాలు మార్మోగించారు. సీఎం డౌన్ డౌన్.. ప్రత్యేక హోదా మా హక్కు అంటూ నినదించారు.