ప్రైవేట్ వాహనాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు?
హైదరాబాద్: తమ డిమాండ్లను పరిష్కారించాలని కోరుతూ సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కార్మిక సంఘాలతో తక్షణం చర్చలు జరిపి ఆర్టీసీ సమ్మెను విరమింపచేసే విధంగా చూడాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు వాహనాల కారణంగా ఆర్టీసీకి ఏటా రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందన్న విషయం బాబుకు తెలుసని.. మరి అటువంటప్పుడు ప్రైవేట్ వాహనాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు ఉందన్నారు. ఈ మేరకు శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాశారు. ఆర్టీసీ కార్మికులపై కక్ష సాధింప చర్యలతో పాటు, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం తగదని సూచించారు.
వారిపై పోలీసు చర్యలు కూడా దారుణంగా ఉన్నాయని వైఎస్ జగన్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులుకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని, వారి శాంతియుత ఆందోళనకు మద్దతిస్తున్నట్లు వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదని జగన్ తెలిపారు. 2014 ఏప్రిల్ 6న ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని చంద్రబాబు ప్రభుత్వంలో విలీనం చేయాలని జగన్ డిమాండ్ చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కారించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామన్న హామీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలన్నారు. ఆర్టీసీ నష్టాలకు తన బాధ్యత ఎంత ఉందో ఆయన గుర్తించాలని జగన్ సూచించారు. డీజిల్ మీద వ్యాట్ రూపంలో ఏడాదికి రూ. 541 కోట్లు ఏపీ ప్రభుత్వానికి ఆర్టీసీ చెల్లించాల్సిన పరిస్థితి ఉందని.. అలాగే విడిభాగాల కొనుగోలు మీద చెల్లించేది మరో రూ.150 కోట్లు ఉంటుందని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. ఆర్టీసీ ప్రైవేటీకరించే ఎత్తుగడలకు ప్రభుత్వాలు స్వస్తి పలకాలన్నారు. వ్యాట్ భారాన్ని ఎత్తివేస్తే ఆర్టీసీ దర్జాగా బతుకుతుందన్న విషయం ప్రభుత్వాలు గుర్తించుకోవాలన్నారు.ఇప్పటికైనా కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించి సమస్యను పరిష్కరించాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.