మహిళా కండక్టర్లపై లాఠీచార్జి దారుణం
సమ్మె పట్ల ప్రభుత్వ తీరు బాగాలేదు: అంబటి రాంబాబు
హైదరాబాద్: రాష్ట్రంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఏపీఎస్‌ఆర్టీసీ సమ్మె పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో జరిగిన సమ్మెలో పాల్గొన్న మహిళా కండక్టర్ల పట్ల పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జి చేయడంలాంటి చర్యలు చూస్తే రాక్షసంగా ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా కార్మికులతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాబు దుబారా చేస్తుంటే.. ఆర్థిక పరిస్థితి గుర్తులేదా?
ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచే విషయంలో గుర్తుకు వచ్చిన రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు.. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో విదేశాల్లో తిరిగినప్పుడు గానీ, ఆయన కార్యాలయాల కోసం కోట్ల రూపాయలు దుబారా చేసినప్పుడుగానీ గుర్తుకు రాలేదా అని అంబటి అన్నారు. ఆర్టీసీ కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు ఏ.రాజారెడ్డి ఒక ప్రకటనలో ఖండించారు. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో సమ్మెలో పాల్గొన్న తమ యూనియన్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.