హామీని విస్మరించడం వల్లే సమ్మె | AP, Telangana governments open letter to the of YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

హామీని విస్మరించడం వల్లే సమ్మె

Published Sun, May 10 2015 1:25 AM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM

హామీని విస్మరించడం వల్లే సమ్మె - Sakshi

హామీని విస్మరించడం వల్లే సమ్మె

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగలేఖ
 
తక్షణం కార్మిక సంఘాలతో చర్చలు జరిపి
సమస్యను పరిష్కరించండి
{పజల ఇబ్బందులు తొలగించండి
వారి ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా..
పోలీసు చర్యలను ఖండిస్తున్నా.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని బాబు నిలబెట్టుకోవాలి

 
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెను విరమింపజేసేలా ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు నేరుగా కార్మిక సంఘాలతో తక్షణమే చర్చలు జరిపి సమస్యను సామరస్య వాతావరణంలో పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన శనివారం ఒక బహిరంగ లేఖ రాశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెదాకా రావడంలో తమ పాత్రను గుర్తుంచుకోవాల్సిందిగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆయనీ సందర్భంగా కోరారు. నాయకులు గతంలో ఆర్టీసీ కార్మికులకిచ్చిన హామీలను నిలబెట్టుకుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదన్నారు.

ఆ ప్రయత్నం చేయనందువల్లే రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనబాట పట్టారన్న నిజాన్ని తమ పార్టీ గుర్తిస్తోందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు తన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు జగన్ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లకు మద్దతుగా శాంతియుతమైన వారి ప్రత్యక్ష కార్యాచరణలో వైఎస్సార్‌సీపీ భాగం పంచుకుంటుందని ప్రకటించారు. అలా భాగం పంచుకోవాల్సిందిగా పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కార్మికులపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను, రెచ్చగొట్టే ప్రకటనలను, పోలీసు చర్యలను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.
 
 ఇచ్చిన హామీని చంద్రబాబు నిలుపుకోవాలి..
 
 చంద్రబాబునాయుడు 2014 ఏప్రిల్ 6న స్వయంగా ఆర్టీసీ కార్మికసంఘ నేతలకిచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలిస్తామని ఇచ్చిన హామీని కూడా ఆయన నిలబెట్టుకోవాలని సూచించారు. ఆర్టీసీ నష్టాలకు తన బాధ్యత ఎంతుందో చంద్రబాబు గుర్తించాలన్నారు. కేవలం ప్రైవేట్ వాహనాల కారణంగా ఏపీఎస్‌ఆర్టీసీకి ఏటా రూ.1,000 కోట్ల నష్టం వాటిల్లుతోందని తెలిసినా వాటినెందుకు ప్రోత్సహిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీజిల్‌పై వ్యాట్ రూపంలో ఆర్టీసీ ఏడాదికి రూ.541 కోట్లను ఏపీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి ఉందని.. ఇదిగాక విడిభాగాల కొనుగోలుపై చెల్లించేది మరో రూ.150 కోట్లు ఉంటుందని తెలిపారు. వ్యాట్ భారాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేస్తే ఆర్టీసీ దర్జాగా బతుకుతుందని తెలిసినా చంద్రబాబు ఆ పని ఎందుకు చేయట్లేదో చెప్పాలని ఆయన నిలదీశారు. వ్యాట్‌ను రద్దు చేసి, ప్రైవేట్ వాహనాలను అరికట్టగలిగితే ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న జీతాలివ్వడం పెద్ద సమస్య కాదని ప్రజలకు అర్థమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వమూ డీజిల్‌పై వ్యాట్‌ను వెంటనే వెనక్కు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. దేశంలోనేగాక ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజారవాణా వ్యవస్థలో ఒకటిగా పేరు తెచ్చుకున్న మన ఆర్టీసీని ప్రైవేటీకరించే ఎత్తుగడలకు ప్రభుత్వాలు స్వస్తి పలకాలని కోరారు. సమ్మెవల్ల కోట్లాదిమంది ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులకు.. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను సామరస్యపూర్వకంగా పరిష్కరించడం ద్వారా వెంటనే స్వస్తి పలకాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement