జిల్లాలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారానికి ఉధృతరూపం దాల్చింది. పలాసలో వారికి వైఎస్సార్‌సీపీ అండగా నిలిస్తే... శ్రీకాకుళంలో సీఐటీయూ మద్దతుగా ఆందోళన చేపట్టింది. రెండు చోట్లా పోలీసులు లాఠీలు ఝుళిపించి బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్టుచేయడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
శ్రీకాకుళం అర్బన్:శ్రీకాకుళంలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు సీఐటీయూ నాయకులు మంగళవారం మద్దతు తెలుపుతూ ధర్నా చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ బయట ధర్నా చేపట్టడంతో బస్సుల రాకపోకలకు, ప్రధాన రోడ్డుపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు వచ్చి ధర్నాను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిటూ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు మరో అడుగు ముందుకేసి సిటు నాయకులను అరెస్ట్ చేసి రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శులు ఎం.తిరుపతిరావు, డి.గోవిందరావు, నాయకులు డి.గణేష్, వై.చలపతిరావు మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ జరిగి రెండేళ్ళు గడచినా ప్రభుత్వంగానీ, యాజమాన్యం గానీ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కార్మికులు చట్టబద్ధంగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం అణచివేతధోరణికి యత్నించడం సరి కాదన్నారు. ఎన్నికలకు ముందు కార్మికుల సంక్షేమమే ధ్యేయమన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత అదే కార్మికులపై దాడి చేయించడం ఆయన నైజాన్ని తెలియజేస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో సిటు నాయకులు కె.నాగమణి, సీహెచ్.రాామ్మూర్తినాయుడు, ఎం.తేజ, అమ్మన్నాయుడు, హెచ్.ఈశ్వరరావు, కె.గురివినాయుడు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
మంగళవారం 210బస్సులు:
శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోలు, పలాస, టెక్కలి, పాలకొండ డిపోల పరిధిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మంగళవారం 210 బస్సులు నడిపారు. శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 29 ఆర్టీసీ, 27 హైర్ బస్సులు, రెండో డిపో నుంచి 42 ఆర్టీసీ, 30 హైర్‌బస్సులు, పాలకొండ డిపో నుంచి 11 ఆర్టీసీ, 13హైర్ బస్సులు, పలాస డిపో నుంచి 14 ఆర్టీసీ, 11 హైర్ బస్సులు, టెక్కలి డిపో నుంచి 27 ఆర్టీసీ, 6 హైర్ బస్సులు నడిపారు.
పలాస : పలాస ఆర్టీసీ డిపో మెయిన్ గేటు వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మంగళవారం ధర్నా చేశారు. బస్సులను అడ్డుకున్నారు. సుమారు 3 గంటల పాటు బస్సులను డిపో నుంచి బయటకు కదలనీయలేదు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు, మున్సిపల్ మాజీ చైర్మన్ వజ్జ బాబూరావు, పలాస పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్, దువ్వాడ శ్రీకాంత్, ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ సంయుక్త కార్యదర్శి ఎన్‌కె రావు, గౌరవ సలహాదారుడు బి.రమణమూర్తి తదితరులు ప్రసంగిస్తూ ఆర్టీసీ పట్ల చంద్రబాబునాయుడు అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టారు.
రాష్ట్రంలో బాబు పుణ్యమాని అన్ని వర్గాల ప్రజలు రోడ్లెక్కిన దుర్గతి ఏర్పడిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆర్టీసీ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లిందని, రాష్ట్రంలో ఎటువంటి అలజడి ఏర్పడలేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే మళ్లీ ఆర్టీసీ కార్మికులకు మంచి రోజులు వస్తాయని జుత్తు జగన్నాయకులు, వజ్జ బాబూరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాశీబుగ్గ సీఐ వై.రామక్రిష్ణ, ఎస్‌ఐ ఆర్.వేణుగోపాలరావు పర్యవేక్షణలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఆందోళన చేపట్టిన నాయకులను బలవంతంగా లాక్కెళ్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
సమ్మె ఉద్రిక్తం
Published Wed, May 13 2015 12:55 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement